ఆకలి తీరాలంటే ఆయన్ని తప్పించాలి.. బీజింగ్‌లో వెలిసిన జిన్‌పింగ్‌ వ్యతిరేక బ్యానర్లు

14 Oct, 2022 10:47 IST|Sakshi

బీజింగ్‌: చైనాలో మునుపెన్నడూ కనిపించని దృశ్యాలు.. సోషల్‌ మీడియా సాక్షిగా వైరల్‌ అవుతున్నాయి. కరోనా కఠిన ఆంక్షలతో జనాలు తీవ్ర అసంతృప్తి.. అసహనంతో రగిలిపోతున్నారు.  ఈ క్రమంలో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌పై వ్యతిరేకత తారాస్థాయికి చేరుతోంది. తాజాగా ఏకంగా రాజధాని బీజింగ్‌ మహానగరంలో జిన్‌పింగ్‌ వ్యతిరేక బ్యానర్లు వెలిశాయి. అయితే..

అప్రమత్తమైన అధికారులు తొలగించినప్పటికీ అప్పటికే వాటి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోయాయి. జిన్‌పింగ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, కొవిడ్‌-19 కఠిన ఆంక్షల్ని తొలగించాలని ఆ బ్యానర్‌లను ఓ ఫ్లై ఓవర్‌పై, మరికొన్ని కూడళ్లలో ఉంచారు. పైగా ఫ్లై ఓవర్‌పై వేలాడదీసిన బ్యానర్లకు కాస్త దూరంలో ఆకర్షణ కోసం మంటలు రాజేశారు. ‘‘కరోనా పరీక్షలు మాకొద్దు. మా ఆకలి తీరితే చాలు. లాక్‌డౌన్‌లు అక్కర్లేదు.. స్వేచ్ఛ కావాలి.. అందుకు జిన్‌పింగ్‌కు ఉద్వాసన పలకాలి’’ అంటూ బ్యానర్లను కట్టారు.


జిన్‌పింగ్‌ ‍వ్యతిరేక బ్యానర్లు తొలగిస్తున్న సిబ్బంది

బీజింగ్‌తో పాటు హయిదియాన్‌లో, మరికొన్ని చోట్ల ఆ బ్యానర్లు వెలిశాయి. అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన పోస్టులను సైతం ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ పోతున్నారు అధికారులు. వీటిని ఏర్పాటు చేసిన వాళ్లను సాహసవీరులుగా పొగుడుతూ చైనా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ వెబ్‌లో పోస్టులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీటిని ఏర్పాటు చేసిన వాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు అక్కడి అధికారులు.

కమ్యూనిస్ట్‌ పార్టీ 20వ కాంగ్రెస్‌ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తైన దరిమిలా, జింగ్‌పిన్‌ మూడో దఫా అధ్యక్ష పగ్గాలు చేపడతాడనే ఊహాగానాల నడుమ.. ఈ వ్యతిరేక పరిణామం ఆసక్తికర చర్చకు దారి తీసింది. తాజాగా కొత్త వేరియెంట్ల కేసులతో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తోంది చైనా.

ఇదీ చదవండి: అప్పుడే అయిపోలేదు.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

మరిన్ని వార్తలు