చైనా భారీ ప్రాజెక్టు; భారత్‌పై ప్రభావం!

30 Nov, 2020 12:29 IST|Sakshi

బీజింగ్‌:  హిమాలయ నదుల్లో ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందిన బ్రహ్మపుత్ర నదిపై భారీ హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు చైనా సిద్ధమైంది. 14వ పంచవర్ష ప్రణాళిక(2021-25) అమలులో భాగంగా టిబెట్‌లో ఈ మేరకు నిర్మాణం చేపట్టనున్నట్లు డ్రాగన్‌ దేశ అధికార మీడియా వెల్లడించింది. చైనా సొసైటీ ఫర్‌ హైడ్రోపవర్‌ ఇంజనీరింగ్‌ 40వ వార్షికోత్సవం సందర్భంగా విద్యుదుత్పత్తి కార్పొరేషన్‌ చైర్మన్‌ యాన్‌ జియాంగ్‌ మాట్లాడుతూ.. ‘‘చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలా జరుగలేదు. చైనీస్‌ జలవిద్యుత్‌ పరిశ్రమలో ఇదొక నూతన అధ్యాయం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని టిబెట్‌లో యార్లాంగ్‌ జాంగ్బో(బ్రహ్మపుత్ర) నదిపై హైడ్రోపవర్‌ ప్రాజెక్టును నిర్మించనుంది’’ అని వ్యాఖ్యానించినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. 

అదే విధంగా టిబెట్‌- అరుణాచల్‌ సరిహద్దులోని మెడాగ్‌ సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, జాతీయ భద్రత, నదీ జలాలు, అంతర్గత భద్రత తదితర అంశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందులో ఇతర దేశాలు ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌(జాతీయ అసెంబ్లీ) వచ్చే ఏడాది ఆమోదించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా జాతీయ ఆర్థిక, సామాజికాభివృద్ధి ప్రణాళికలో భాగంగా 2035 నాటికి సాధించాల్సిన లక్ష్యాల గురించి తీర్మానం చేస్తూ చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీ గత నెలలో నిర్ణయం తీసుకుంది. (చదవండి: వైరస్‌ భారత్‌ నుంచి వచ్చిందంటూ చైనా వాదనలు)

చైనా వైఖరిపై విమర్శలు
ఇక ఈశాన్య రాష్ట్రాల వరప్రదాయిని బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మాణాల నేపథ్యంలో ఇటు భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి టిబెట్‌లో బ్రహ్మపుత్రతో పాటూ.. జిన్షా, లాన్‌శాంగ్‌, నుజియాంగ్‌ నదులు ప్రవహిస్తున్నాయి. జలవిద్యుత్‌కు బ్రహ్మపుత్రతో పాటు ఇవి కూడా అనుకూలమైనవనని నిపుణులు ఇప్పటికే తేల్చినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే వాటన్నింటినీ కాదని, భారత్‌లో ప్రవహించే బ్రహ్మపుత్రపైనే చైనా దృష్టి పెట్టడం గమనార్హం. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చల్లారేలా చర్చలు జరుగుతున్న వేళ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం వక్రబుద్ధితోనే బ్రహ్మపుత్ర నదిపై విరివిగా జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు డ్రాగన్‌ దేశం ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. (చదవండి: మాంసం ముద్దలు విసురుతూ నిరసన)  

కాగా బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలోని దిగువ ప్రాంతాలకు నష్టం చేకూర్చేవిధంగా వ్యవహరించవద్దని భారత్‌ ఇప్పటికే చైనాకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. డ్రాగన్‌ దేశ నిర్ణయాల పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూనే దిగువ ప్రాంత ప్రయోజనాలు కాలరాసే విధానాన్ని సహించబోమని తమ వైఖరిని స్పష్టం చేసింది. ఈ క్రమంలో 2006లో సరిహద్దు నదీ జలాల విషయంలో తలెత్తిన సమస్యలకు పరిష్కారం కనుగొనే విధంగా ఎక్స్‌పర్ట్‌ లెవల్‌ మెకానిజం(ఈఎల్‌ఎం)ను ఏర్పాటు చేశారు. ద్వైపాక్షిక బంధంలో భాగంగా ఇప్పటికే రూపొందించిన ఎంఓయూల నేపథ్యంలో బ్రహ్మపుత్ర, సట్లెజ్‌ నదులకు సంబంధించిన వరద జలాలు, హైడ్రోలాజికల్ ప్రాజెక్ట్‌ల సమాచారాన్ని చైనా భారత్‌తో పంచుకోవాల్సి ఉంటుంది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా