అవన్నీ అబద్ధాలు.. కట్టుకథలు: చైనా

3 Nov, 2020 18:46 IST|Sakshi
నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి- చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌(ఫైల్‌ఫొటో)

నేపాల్‌ భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ వార్తలు

భారత్‌పై విషం చిమ్మిన చైనా మీడియా

 

బీజింగ్‌: నేపాల్‌ భూభాగాన్ని తాము ఆక్రమించామన్న వార్తలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అవన్నీ వట్టి వదంతులేనని కొట్టిపారేసింది. నేపాల్‌- టిబెట్‌ సరిహద్దులో గల తమ భూభాగంలోని సుమారు 150 హెక్టార్ల స్థలాన్ని డ్రాగన్‌ దేశం ఆక్రమించిందని నేపాలీ రాజకీయ నాయకులు ఆరోపణలు చేసినట్లుగా టెలిగ్రాఫ్‌ మంగళవారం ఓ కథనం ప్రచురించింది. ఈ విషయంపై మీడియా సమావేశంలో స్పందించిన చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్బిన్‌.. ‘‘ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం. నిరాధారమైని. కల్పితాలు మాత్రమే’’అని స్పష్టం చేశారు.(చదవండి: అరుణాచల్‌ సరిహద్దులో చైనా కొత్త రైల్వేలైన్)

కాగా నేపాల్‌లోని హుమ్లా జిల్లాలో గల భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలను ఆ దేశ అధికార మీడియా తీవ్రంగా ఖండించింది. భారత్‌కు అనుకూలంగా ఉండే కొంతమంది నేపాలీ ప్రతిపక్ష నేతలు కావాలనే ఈవిధంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. సౌత్‌వెస్ట్‌(నైరుతి) చైనాలో గల టిబెట్‌ అటానమస్‌(స్వయంప్రతిపత్తి) రీజియన్‌లో చేపట్టిన నిర్మాణాలను నేపాల్‌లో నిర్మించినట్లు ప్రచారం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టింది. భారత్‌కు అనుకూలంగా ఉన్నవాళ్లే తమ గురించి ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారంటూ విషం చిమ్మింది.

ఇక నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి గత కొన్నినెలలుగా భారత్‌ను లక్ష్యంగా చేసుకుని, విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అదే సమయంలో చైనాతో స్నేహం పెంపొందించుకుంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయితే గతకొన్ని రోజులుగా భారత్‌– నేపాల్‌ సంబంధాల్లో వినిపించిన చిటపటలు కాస్త సద్దు మణిగాయి. భారత సైనిక దళాల ప్రధానాధికారి ఎం.ఎం. నరవణే నవంబరులో ఆ దేశంలో పర్యటించబోతున్నారు. నేపాల్‌ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఆయనకు నేపాల్‌ సైనిక గౌరవ జనరల్‌గా గౌరవ పురస్కారాన్ని అందజేయబోతున్నారు. ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాల సైనిక చీఫ్‌లనూ పరస్పరం గౌరవించుకోవడమనే సంప్రదాయాన్ని కొనసాగించాలని నేపాల్‌ భావించగా, అందుకు మన దేశం కూడా అంగీకరించడం వంటి పరిణామాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా