నిప్పుతో చెలగాటలొద్దు! బైడెన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన జిన్‌పింగ్‌..

16 Nov, 2021 19:19 IST|Sakshi

బీజింగ్‌: చైనా అధినేత జిన్‌ పింగ్‌ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వార్నింగ్‌ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తైవాన్ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతివ్వడమంటే నిప్పుతో చెలగాటమాడినట్లే అని జిన్‌ పింగ్‌ నోరు వ్యాఖ్యానించినట్టు చైనా మీడియా అధికారికంగా వెల్లడించింది. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య మంగళవారం వర్చువల్‌ సమావేశం జరిగింది. దాదాపు మూడున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో రెండు అగ్ర రాజ్యాల మధ్య దెబ్బతిన్న ధ్వైపాక్షిక సంబంధాలతో పాటు వివిధ అంశాలపై చర్చించారు.
చదవండి: అమెరికాకు షాక్‌ ఇచ్చిన చైనా..ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా అవిర్భావం

ఈ సందర్భంగా తైవాన్‌ విషయం చర్చలోకి రావడంతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌ను తమ భూభాగమని వాదిస్తోన్న చైనా.. అమెరికాను జోక్యం చేసుకోవద్దని పరోక్షంగా హెచ్చరించింది. ‘స్వాతంత్ర్యం కోసం తైవాన్‌ అధికారులు అమెరికాపై అధారపడుతున్నారు. అంతేగాక యూఎస్‌లోని కొంతమంది తైవాన్‌ను ఉపయోగించి చైనాను నియంత్రించాలని చూస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. నిప్పుతో ఆడుకోవడం లాంటిది. నిప్పుతో చెలగాటమాడితే కాలిపోతారు" అని చైనా అధ్యక్షుడు వ్యాఖ్యానించినట్టు కథనాలు వెలువడ్డాయి.

రెండు అగ్ర దేశాల మధ్య నెలకొన్న వైరుధ్యాలను తొలగించేందుకు, ధ్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరిచేందుకు ఈ వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహించారు. వైట్‌హౌజ్‌ నుంచి జో బైడెన్‌ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య ఉన్న పోటీ ఉద్ధేశపూర్వకంగా అనాలోచితంగా విభేదాలుగా మారకుండా చూసుకోవాలని అన్నారు. దీనికి బదులుగా బీజింగ్‌ నుంచి జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. ‘బైడెన్‌ నా పాత మిత్రుడే కానీ ప్రత్యర్థులు మరింత సన్నిహితంగా పనిచేయాలి’ అని ఆకాంక్షించారు. చైనా-యూఎస్‌ మధ్య కమ్యూనికేషన్‌ను, సహకారాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు