COP 27: పాపం మీది.. పరిహారమివ్వండి.. పేద దేశాల డిమాండ్‌

9 Nov, 2022 02:47 IST|Sakshi
ఆంటిగ్వా బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్‌ బ్రౌనీ 

షెర్మ్‌–ఎల్‌–షేక్‌: భూతాపం, ప్రకృతి విపత్తులు, ఉత్పాతాలు.. వీటికి శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వినియోగించడం, పర్యావరణాన్ని నాశనం చేయడమే కారణం. ఈ పాపం సంపన్న, అభివృద్ధి చెందిన దేశాలదేనని పేద దేశాలు ఘోషిస్తున్నాయి. శిలాజ ఇంధనాలను అధికంగా ఉపయోగించే దేశాల కారణంగా తాము బాధితులుగా మారాల్సి వస్తోందని వాపోతున్నాయి. బడా దేశాలు, కార్పొరేట్‌ సంస్థలు నష్ట పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది.

ఈజిప్ట్‌లోని షెర్మ్‌–ఎల్‌–షేక్‌లో జరుగుతున్న కాప్‌–27లో పలుదేశాల నాయకులు ఈ డిమాండ్‌కు మద్దతుగా గళం విప్పుతున్నారు. విపత్తుల్లో నష్టపోతున్న పేద దేశాలకు న్యాయం చేయాలని మలావీ దేశాధ్యక్షుడు లాజరస్‌ చక్‌వెరియా అన్నారు. శిలాజ ఇంధన కంపెనీలు నిత్యం 3 బిలియన్‌ డాలర్ల లాభాలు ఆర్జిస్తున్నాయని ఆంటిగ్వా బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్‌ బ్రౌనీ చెప్పారు. అందులో కొంత సొమ్మును పేద దేశాలకు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భూగోళాన్ని మండించి, సొమ్ము చేసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంధన కంపెనీలు తమ లాభాల నుంచి గ్లోబల్‌ కార్బన్‌ ట్యాక్స్‌ చెల్లించాలన్నారు. మానవ నాగరికతను బలిపెట్టి లాభాలు పిండుకోవడం సరైంది కాదన్నారు. నష్టపరిహారం కోసం అవసరమైతే అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయిస్తామని తేల్చిచెప్పారు. పెద్ద దేశాల నేతలు, కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులు ప్రతిఏటా కాప్‌కు సదస్సుకు హాజరై, ఘనంగా ప్రకటనలు ఇచ్చి వెళ్లిపోతున్నారని తప్పు ఆచరణలో ఏమీ చేయడం లేదని గాస్టన్‌ బ్రౌనీ ఆరోపించారు. వాతావరణ లక్ష్యాలను సాధించాలంటే చిన్న దేశాలపై విధించిన చట్టవిరుద్ధమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్‌ మాంగాగ్వే పేర్కొన్నారు.  

మడ అడవుల సంరక్షణలో సహకరిస్తాం 
మడ అడవుల పునరుద్ధరణలో భారత్‌ నైపుణ్యం సాధించిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ చెప్పారు. పర్యావరణానికి అత్యంత కీలకమైన మడ అడవుల సంరక్షణ కోసం గత ఐదు దశాబ్దాలుగా కార్యాచరణ కొనసాగిస్తోందని అన్నారు. ఈ విషయంలో ఇతర దేశాలకు సహకరించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని తెలిపారు. కాప్‌–27 సందర్భంగా యూఏఈ, ఇండోనేషియా ఆధ్వర్యంలో మాంగ్రూవ్‌ అలయెన్స్‌ ఫర్‌ క్లైమేట్‌(ఎంఏసీ)ని ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా మడ అడవుల పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం, కాపాడుకోవడం ఈ కూటమి లక్ష్యం. ఈ సందర్భంగా భూపేంద్ర మాట్లాడారు. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని సాధించడానికి మడ అడవుల సంరక్షణ అత్యంత కీలకమని సూచించారు. కర్బన ఉద్గారాల నిర్మూలన ఇలాంటి అడవులతో సాధ్యమవుతుందన్నారు. అండమాన్, సుందర్బన్స్, గుజరాత్‌ తీర ప్రాంతంలో మడ అడువుల విస్తీర్ణం పెరిగిందని వెల్లడించారు.
చదవండి: షాకింగ్‌ రిపోర్ట్‌: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్‌-చైనా!

మరిన్ని వార్తలు