ట్రంప్‌ క్యాంపులో చీలికలు?

7 Nov, 2020 04:11 IST|Sakshi
అధ్యక్ష భవనంలో మీడియా సమావేశం అనంతరం నిరాశతో వెళ్తున్న ట్రంప్‌

వాషింగ్టన్‌: అధికారం చేపట్టినప్పటి నుంచి తరచూ వివాదాల్లో చిక్కుకుపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా తన సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియపై విచ్చలవిడి విమర్శలకు దిగడం, కౌంటింగ్‌ ప్రక్రియ నిలిపివేతకు న్యాయస్థానాల్లో కేసులు, కౌంటింగ్‌ సాగుతూండగానే తాను గెలిచినట్లుగా ప్రకటించుకోవడం వంటి వాటిపై రిపబ్లికన్‌ పార్టీ నేతలు పలువురు గుర్రుగా ఉన్నారు. దీంతో ట్రంప్‌ చర్యలకు పార్టీ తరఫు నుంచి తగిన మద్దతు లేదు సరికదా.. రిపబ్లికన్ల నేతగా మరోసారి ఎన్నుకునే అవకాశాలూ మృగ్యమవుతున్నాయి.

సెనేట్‌లో ట్రంప్‌ మద్దతుదారుగా ఇప్పటివరకూ వ్యవహరించిన మిచ్‌ మెక్‌కానెల్‌ ఇప్పటికే ఓట్ల లెక్కింపు జరుగుతూండగానే గెలిచినట్లు ట్రంప్‌ ప్రకటించడాన్ని పరోక్షంగా ఆక్షేపించారు. ‘‘గెలిచానని చెప్పుకోవడం వేరు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడం వేరు’’అని కెంటకీ నుంచి గెలుపొందిన మిచ్‌ స్పష్టం చేశారు. ట్రంప్‌పై తమ వ్యతిరేకతను స్పష్టం చేసిన వారిలో మిచ్‌ ఒక్కరే లేరు. ఫ్లారిడా సెనేటర్, ఇటీవలే ట్రంప్‌ ర్యాలీలో ప్రసంగాలు చేసిన మార్కో రూబియో ట్విట్టర్‌ వేదికగా ట్రంప్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం చెప్పుకోవాల్సిన అంశం. ‘‘చట్టబద్ధంగా పోలైన ఓట్ల లెక్కింపులో జాప్యం జరగడం మోసం కాదు’’అని  ట్వీట్‌ చేశారు.

చట్టబద్ధ ఓట్లు లెక్కిస్తే నాదే గెలుపు
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్‌ ఆరోపణలు చేశారు. చట్టబద్ధమైన ఓట్లనే లెక్కిస్తే తనదే గెలుపన్నారు. వైట్‌హౌస్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల్లో నిజాయతీగా గెలవలేరని డెమొక్రాట్లకు తెలుసు. అందుకే భారీగా అవకతవకలకు, అక్రమాలకు పాల్పడ్డారు. లక్షలాదిగా గుర్తు తెలియని మెయిల్‌ ఇన్‌ ఓట్లు వేయించారు. దీనికి సంబంధించి నా దగ్గర చాలా ఆధారాలున్నాయి’ అని తెలిపారు. నిజాయతీతో కూడిన ఎన్నికలు, నిజాయతీతో కూడిన లెక్కింపు కోరుకుంటున్నామన్నారు. ‘చట్టబద్ధ ఓట్లు లెక్కిస్తే తేలిగ్గా గెలుపు సాధిస్తా. అక్రమ ఓట్లను లెక్కిస్తే ఫలితాలను తారుమారు చేస్తున్నట్లే. ఆలస్యంగా వచ్చిన ఓట్లను లెక్కించాలనుకుంటే మేం ప్రతిఘటిస్తాం. కానీ, చాలా ఓట్లు ఆలస్యంగా వచ్చాయి’ అని ట్రంప్‌ అన్నారు. ఎన్నికల ఫలితాల విశ్లేషకులు, ప్రముఖ టెక్‌ సంస్థలు, మీడియా.. డెమొక్రాట్ల పక్షాన నిలబడి ఓటర్లను మభ్యపెట్టాయని ట్రంప్‌ ఆరోపణలు గుప్పించారు.  

ప్రసారం చేయని ఏబీసీ, సీబీఎస్, ఎన్‌బీసీ
శ్వేతసౌధంలో ట్రంప్‌ మీడియా సమావేశాన్ని ఏబీసీ, సీబీఎస్, ఎన్‌బీసీ వంటి వార్తా చానళ్లు పట్టించుకోలేదు. ట్రంప్‌వ్యాఖ్యలపై సీఎన్‌ఎన్‌కు చెందిన ఆండర్సన్‌ కూపర్‌.. తన సమయం ముగిసిందని తెలిసి వెనక్కి తిరిగి వెళ్తున్న ఊబకాయం తాబేలు వంటి వాడంటూ ట్రంప్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అక్రమాలు జరగలేదని అందరూ భావిస్తుండగా ట్రంప్‌ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తుండటం వల్లే ఆ సమావేశాన్ని తాము ఆపేశామని ఎన్‌బీసీకి చెందిన లెస్టర్‌ హోల్ట్‌ చెప్పారు. భారీగా దొంగ ఓట్లు పడ్డాయనేందుకు ఎలాంటి సూచనలు కనిపించడం లేదని, ఇది ట్రంప్‌ చేస్తున్న ఆరోపణ అని సీబీఎస్‌ కరస్పాండెంట్‌ నాన్సీ కోర్డెస్‌ చెప్పారు. అధ్యక్షుడు చేస్తున్న తప్పును సరి చేసేందుకే తాము ట్రంప్‌ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదని ఎంఎస్‌ఎన్‌బీసీ వ్యాఖ్యాత బ్రియాన్‌ విలియమ్స్‌ అన్నారు. ‘మాకు తెలిసినంత వరకు చట్ట విరుద్ధమైన ఓట్లు ఏమీ లేవు. మాకు తెలిసిన ప్రకారం ట్రంప్‌కు గెలుపు కూడా లేదు అని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు జాప్యం అవుతుండటంతో ట్రంప్‌ అసహనంతో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.

మరిన్ని వార్తలు