ఆ యుద్ధ విమానాన్ని పైలెట్‌ గాలిలో ఎలా వదిలేశాడు?

21 Sep, 2023 13:50 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైటర్ జెట్ ఎఫ్‌-35 గత ఆదివారం తప్పిపోయింది. ఒక రోజు తర్వాత దాని ఆచూకీ లభ్యమయ్యింది. ఈ విషయాన్ని మిలటరీ అధికారులు ధృవీకరించారు. ఫైటర్ జెట్ అదృశ్యమైన తర్వాత దానిని కనుగొనేందుకు స్థానికులు సాయం  చేయాలని సంబంధిత అధికారులు కోరారు.

సౌత్ కరోలినాలోని నార్త్ చార్లెస్టన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన తరువాత దాని జాడ తెలియరాలేదు. నివేదిక ప్రకారం విమానం ఎగురుతున్నప్పుడు దానిలో లోపం తలెత్తగా పైలట్ దానిని ఎజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఫైటర్ జెట్ నుండి పైలట్ తనను తాను ఎజెక్ట్ చేసినప్పుడు, అతను యుద్ధ విమానాన్ని ఆటో-పైలట్ మోడ్‌లో ఉంచాడు. విమానం నుంచి బయటకు వచ్చిన పైలట్‌ను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. 

అదే సమయంలో గాలిలో ఎగురుతున్న రెండవ ఎఫ్‌-35 సురక్షితంగా స్థావరానికి తిరిగి వచ్చింది. సైనిక అధికారులు అదృశమైన యుద్ధవిమాన శకలాలను గుర్తించారు. 100 మిలియన్ డాలర్ల విలువైన విమానానికి సంబంధించిన శకలాలు గ్రామీణ విలియమ్స్‌బర్గ్ కౌంటీలో లభ్యమైనట్లు మిలిటరీ అధికారులు తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునికతరహాలోని అమెరికాకు చెందిన మొట్టమొదటి స్టెల్త్ ఫైటర్ జెట్ విమానం. ఈ విమానం రహస్య మిషన్లను అత్యంత వేగంగా పూర్తి చేయగలదు.

ఈ ఫైటర్ జెట్ పూర్తి పేరు ఎఫ్‌-35 లైట్నింగ్ 2. ఇది ఆల్-వెదర్ స్టీల్త్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్. ఈ యుద్ధ విమానం అదృశ్యమైనప్పుడు, దాని భాగాలు అమెరికా శత్రు దేశాల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని అమెరికా అధికారులు ఆందోళన చెందారు. విమానాన్ని కనుగొనడంలో స్థానికుల సహాయాన్ని కోరుతూ, జాయింట్ బేస్ చార్లెస్టన్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అయితే అతని విజ్ఞప్తి అనంతరం అతనిపై ఆన్‌లైన్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో ఆయన ఈ సంఘటన ఇంకా విచారణలో ఉంది. దర్యాప్తు ప్రక్రియ సమగ్రతను కాపాడటానికి మేము అదనపు వివరాలను అందించలేకపోతున్నామని తెలిపారు. 

కాగా ఎఫ్‌-35 జెట్‌ యుద్ధ విమానం ఖరీదు 100 మిలియన్‌ డాలర్లు. ఇండియన్‌ కరెన్సీలో 830 కోట్ల రుపాయలు. పైలెట్‌ తెలిపిన వివరాల ప్రకారం అననుకూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. పైలెట్‌ తాను నడుపుతున్న విమానం ఎక్కడ కూలిపోయిందో గుర్తించలేక పోయాడని, ఈ విషయాన్ని అతను చార్లెస్టన్ కౌంటీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కాల్‌లో చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలియజేసింది.

కాగా అంతకుముందు ఆగస్టు చివరి వారంలో అమెరికాకు చెందిన రెండు విమానాలు కూలిపోయాయి. ఆగస్టు 27న ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న టీవీ దీవుల్లో శిక్షణ సమయంలో విమానం కూలి ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించారు. అంతకుముందు యూఎస్‌ మెరైన్ కార్ప్స్ ఎఫ్‌/A-18 హార్నెట్ ఫైటర్ జెట్  పైలట్ శాన్ డియాగో సమీపంలో ప్రమాదంలో మరణించాడు.
ఇది కూడా చదవండి: మెన్స్‌ అండర్‌వేర్‌ విక్రయాలు ఎందుకు తగ్గాయి? మాంద్యంతో సంబంధం ఏమిటి?

మరిన్ని వార్తలు