Asian Games 2023: చరిత్ర సృష్టించిన షఫాలీ వర్మ.. తొలి భారత క్రికెటర్‌గా

21 Sep, 2023 13:46 IST|Sakshi

భారత మహిళల జట్టు యువ బ్యాటర్‌ షఫాలీ వర్మ అరుదైన ఘనత సాధించింది. ఏషియన్‌ గేమ్స్‌-2023లో భాగంగా క్వార్టర్‌ ఫైనల్‌-1లో మలేషియాపై షఫాలీ వర్మ  అద్భుతమైన హాఫ్‌ సెంచరీ సాధించింది. తద్వారా ఏషియన్‌ గేమ్స్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన మొదటి భారత క్రికెటర్‌గా  షఫాలీ చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక హాఫ్‌ సెంచరీని షఫాలీ కేవలం 31 బంతుల్లోనే సాధించింది.

ఓవరాల్‌గా 39 బంతులు ఎదుర్కొన్న వర్మ.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67 పరుగులు చేసింది. అయితే దురదృష్టవశాత్తూ వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రద్దు అయింది. అయినప్పటికీ మలేషియా కంటే భారత్‌ ర్యాంక్‌ అత్యధికంగా ఉండడంతో.. ఉమెన్‌ ఇన్‌ బ్లూ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. వర్షం కారణంగా రద్దు అయిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన మలేషియా తొలుత భారత్‌ను బ్యాటింగ్‌ అహ్హనించింది.

బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షాపాలీ వర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం మంధాన తొలి వికెట్‌గా వెనుదిరిగింది. భారత్‌ స్కోర్‌ 59/1 ఉండగా వర్షం మొదలైంది. ఆతర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు.

అనంతరం బ్యాటింగ్‌ మొదలెట్టిన భారత్‌   నిర్ణీత 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి భారత్‌ 173 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ పాటు పాటు రోడ్రిగ్స్(47 నాటౌట్‌), రిచా ఘోష్‌(7 బంతుల్లో 21 నాటౌట్‌) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ దుమ్మురేపారు. ఆ తర్వాత మలేషియా ఇన్నింగ్స్‌ ఆరంభంలో మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో అంపైర్‌లు మ్యాచ్‌ను రద్దు చేశారు.
చదవండి: Gambhir-SRK Viral Photo: షారుఖ్‌ ఖాన్‌తో ఫొటో.. బాలీవుడ్‌ కింగ్‌ మాత్రమే కాదు..: గంభీర్‌ పోస్ట్‌ వైరల్‌

మరిన్ని వార్తలు