చివరి రోజుల్లో.. అవమానభారంతో...

11 Jan, 2021 05:10 IST|Sakshi

ట్రంప్‌పై అభిశంసనకు పెరుగుతున్న మద్దతు

నేడు తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న డెమొక్రాట్లు  

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గద్దె దిగిపోవడానికి కేవలం పది రోజులే గడువు ఉన్నప్పటికీ అంతకంటే ముందే ఆయనను సాగనంపాలని డెమొక్రాట్లు కృతనిశ్చయంతో ఉన్నారు. క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారుల దాడితో ఇక ఆయన చేష్టలు భరించలేని స్థితికి సొంత పార్టీ రిపబ్లికన్లు కూడా వచ్చారు. దీంతో సోమవారం నాడు ట్రంప్‌పై ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టనున్న అభిశంసన తీర్మానానికి మద్దతు పెరుగుతోంది. ట్రంప్‌ చర్యల్ని రిపబ్లికన్‌ నేతలు కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

‘‘ట్రంప్‌ చేసిన నేరం చిన్నది కాదు. వెంటనే ఆయనను గద్దె నుంచి దింపేయాలి’’అని రిపబ్లికన్‌ ప్రతినిధి పాట్‌ టూమీ వ్యాఖ్యానించారు. డెమొక్రాట్లకి ఆధిక్యం ఉన్న ప్రతినిధుల సభలో ట్రంప్‌పై ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానం నెగ్గడం లాంఛనమే. అయితే రిపబ్లికన్లు కూడా ట్రంప్‌ వైఖరితో విసిగి వేసారి ఉండడంతో వారి ఆధిక్యం ఎక్కువగా ఉన్న సెనేట్‌లో ఏమవుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌ ఉభయ సభల్లో 150 మందికిపైగా రిపబ్లికన్‌ సభ్యులు ట్రంప్‌పై తీసుకురానున్న అభిశంసనకు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ట్రంప్‌ను ఎందుకు అభిశంసించాలని అనుకుంటున్నారో, దానికి సంబంధించిన ఆర్టికల్స్‌ రచించడం కూడా పూర్తయిందని డెమొక్రాట్‌ సభ్యుడు టెడ్‌ లూయీ చెప్పారు.

ఈ ఆర్టికల్స్‌కి 180 మంది మద్దతు ఉందన్నారు. క్యాపిటల్‌ భవనంపై దాడికి తన మద్దతుదారుల్ని రెచ్చగొడుతూ ట్రంప్‌ చేసిన ట్వీట్లు, వీడియోలన్నీ ఇప్పటికే డెమొక్రాట్లు సేకరించి ఉంచారు. సోమవారం నాడు డెమొక్రాట్లు ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానంపై బుధవారం ఓటింగ్‌ ఉంటుంది. అప్పటికి ట్రంప్‌ అధ్యక్ష పీఠం వీడడానికి వారం మాత్రమే గడువు ఉంటుంది. ప్రతినిధుల సభలో నెగ్గిన వెంటనే అభిశంసన తీర్మానం సెనేట్‌కి వెళుతుంది. రిపబ్లికన్లంతా ఏకమై ట్రంప్‌ను వ్యతిరేకిస్తే.. సెనేట్‌ కూడా అభిశంసనని ఆమోదిస్తే ఆయన గద్దె దిగాల్సిందే. అభిశంసన తీర్మానం ఉభయ సభల్లో నెగ్గితే ట్రంప్‌ అవమానభారంతో ఇంటి దారి పట్టడమే కాదు, మళ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేకపోవచ్చు. అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న వ్యక్తిగా కూడా ట్రంప్‌ నిలిచిపోతారు.  

ఏకాకి అవుతున్న ట్రంప్‌
ఎన్నికల్లో ఓటమిని హుందాగా అంగీకరించలేకపోవడం, ప్రజాస్వామ్యానికి గుండె కాయలాంటి చట్టసభల భవనంపై దాడికి అనుచరుల్ని ఉసిగొల్పడం వంటి చేష్టలతో ట్రంప్‌ ఏకాకిగా మారుతున్నారు. ఆయన మద్దతుదారుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌తో పాటు, ఆయన కేబినెట్‌లోని కొందరు మంత్రులు కూడా ట్రంప్‌కి వ్యతిరేకంగా మారారు. లిసా ముర్కోవ్‌స్కీ, ఆర్‌–ఆలస్కా అనే ఇద్దరు మహిళా మంత్రులు ట్రంప్‌ని వెంటనే గెంటేయాలంటూ పిలుపునిచ్చారు. ‘‘ట్రంప్‌ పదవిలో కొనసాగినన్నాళ్లూ దేశానికి, ప్రజాస్వామ్యానికే కాకుండా రిపబ్లికన్‌ పార్టీకి కూడా ప్రమాదమేనని కాంగ్రెస్‌ సభ్యుడు ఆడమ్‌ స్కిఫ్‌ అన్నారు.   మరోవైపు అభిశంసన ప్రక్రియని ట్రంప్‌ ఎలా ఎదుర్కోబోతున్నారన్నది ఎవరికీ తెలియడం లేదు. సామాజిక మాధ్యమాల్లో ట్రంప్‌ని తొలగించడంతో ఆయన ప్రత్యామ్నాయ వేదికను ఎంపిక చేసుకునే పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు