కరోనా : అమెరికాను ఏ దేశం అందుకోలేదు : ట్రంప్‌

11 Aug, 2020 08:33 IST|Sakshi

వాషింగ్టన్‌ : కరోనావైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉన్నదని, ఆ తర్వాతి స్థానం భారత్‌దేనని  ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. కోవిడ్‌ టెస్టుల్లో అమెరికాకు దరిదాపుల్లో మరేదేశం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌ రెండో స్థానంలో ఉన్నా.. అది అమెరికాను మించలేదన్నారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అమెరికాలో ఇప్పటి వరకు 65 మిలియన్ల కోవిడ్‌ టెస్టులు నిర్వహించాం. ఇదే ప్రపంచంలో అత్యధికం. ఆ తర్వాత 150 కోట్ల జనభా ఉన్న భారత్‌లో 11 మిలియన్ల టెస్టులు నిర్వహిచి రెండో స్థానంలో ఉంది. ప్రపంచలో ఏ దేశం నిర్వహించలేనన్ని నాణ్యమైన టెస్టులను అమెరికా నిర్వహించింది. ఈ విషయంలో అమెరికాను ఏ దేశం అందుకోలేదు’అని ట్రంప్‌ పేర్కొన్నారు. (చదవండి : రికార్డు స్థాయిలో రికవరీ)

అలాగే ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ను తీసుకొస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. అమెరికాలో గత వారం రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా గత వారం రోజులుగా 14శాతం మేర కేసులు తగ్గాయన్నారు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య 7 శాతం, మరణాలు 9శాతం తగ్గాయని ట్రంప్‌ వెల్లడించారు. కాగా, అమెరికాలో సోమవారం నాటికి  52,12,499 మందికి కరోనా బారిన పడగా, 1,65,766 మంది మరణించారు. ఇక భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 22,15,074కు చేరింది.  ఈ మహమ్మారి పడి ఇప్పటి వరకు 44,386 మంది ప్రాణాలు కోల్పోయారు. 
(చదవండి : రష్యా వ్యాక్సిన్‌ విడుదల రేపే?)

మరిన్ని వార్తలు