సత్య నాదెళ్లకు ‘డబుల్‌’ ఆనందం

18 Jun, 2021 02:42 IST|Sakshi

మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌గా నియామకం

సీఈఓగానూ కొనసాగింపు..

అదనపు బాధ్యతలతో మరింత విశ్వాసం

న్యూయార్క్‌: భారతీయ అమెరికన్, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల పనితీరుకు పదోన్నతి లభించింది. ఏడేళ్లుగా సీఈఓ బాధ్యతల్లో ఉన్న ఆయనకు కంపెనీ చైర్మన్‌గానూ బాధ్యతలను అప్పగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చైర్మన్‌ బాధ్యతల్లో ఉన్న జాన్‌ థామ్సన్‌ ముఖ్య ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ బాధ్యతల్లోకి తిరిగి వెళ్లనున్నారు. బోర్డు స్వతంత్ర డైరెక్టర్లు ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. 2014లో మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు థామ్సన్‌ ముఖ్య స్వతంత్ర డైరెక్టర్‌ బాధ్యతలనే నిర్వహించడం గమనార్హం. టెక్నా లజీ ఎగ్జిక్యూటివ్‌గా థామ్సన్‌కు దశాబ్దాల అనుభవం ఉంది.

2014లో సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా ప్రకటించిన బిల్‌గేట్స్‌.. చైర్మన్‌ పదవికి థామ్సన్‌ను ప్రతిపాదిస్తూ ఆ బాధ్యతల నుంచి తాను తప్పుకున్నారు. నూతన పదవిలో సత్య నాదెళ్ల కంపెనీ బోర్డు ముందు ఎజెండాను ఉంచడంతోపాటు సరైన వ్యూహాత్మక అవకాశాలను వెలుగులోకి తీసుకురావడం, కీలకమైన సమస్యలను గుర్తిం చి వాటి పరిష్కారాలను బోర్డు దృష్టికి తీసుకువస్తారని మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. 2014లో స్టీవ్‌ బాల్మర్‌ నుంచి మైక్రోసాఫ్ట్‌ సీఈవో పగ్గాలు స్వీకరించిన సత్య నాదెళ్ల.. ఏడేళ్ల తన నాయకత్వంతో క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో మైక్రోసాఫ్ట్‌ను దిగ్గజ సంస్థగా తీర్చిదిద్దినట్టు స్థానిక మీడియా రిపోర్ట్‌ చేసింది. దీంతో కంపెనీకి లాభాల వర్షం కురియడమే కాకుండా.. 2 లక్షల కోట్ల డాలర్లకు మార్కెట్‌ విలువ విస్తరించినట్టు పేర్కొంది.

సత్య రాక ముందు మైక్రోసాఫ్ట్‌ సంస్థ మొబైల్స్‌ వ్యాపారంలో చేతులు కాల్చుకుంది. కానీ, సత్య నాదెళ్ల కంపెనీకి భవిష్యత్తునిచ్చే విభాగాలపై దృష్టి సారించారు. క్లౌడ్‌ కంప్యూటింగ్, ఆగ్మెంటెడ్‌ రియాలిటీలో మైక్రోసాఫ్ట్‌ను బలంగా ముందుకు తీసుకెళ్లడం గమనార్హం. 2016లో లింక్డ్‌ఇన్‌ కొనుగోలు సైతం ఆయన వ్యూహంలో భాగమే. సత్య పనితీరు కంపెనీ బ్యాలెన్స్‌షీట్‌లో స్పష్టంగా ప్రతిఫలించింది. దాంతో మైక్రోసాఫ్ట్‌ షేరు ఏడేళ్లలో 150% లాభాలను ఇచ్చింది. ఆ పనితీరుకు కితాబుగా కంపెనీ బోర్డు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు