Russia Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్ధం.. ఇక రష్యాను తిట్టేయొచ్చు! పుతిన్‌ చావుపై కూడా..

11 Mar, 2022 08:25 IST|Sakshi

ఉక్రెయిన్‌పై ఆక్రమణకుగానూ రష్యాపై కోపంతో రగిలిపోతున్నారు కొందరు. అయితే వాళ్ల తమ ఆక్రోశాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవడానికి కొన్ని అభ్యంతరాలు అడ్డం పడుతున్నాయి. విద్వేషపూరిత కామెంట్లు, హింసాత్మక సందేశాలు, ఉల్లంఘనల పేరిట.. అలాంటి పోస్టులకు అనుమతి ఇవ్వడం లేదు.  ఈ తరుణంలో ఫేస్‌బుక్‌ కాస్త ఊరట ఇచ్చింది. 

ఉక్రెయిన్‌ ఆక్రమణ విషయంలో రష్యాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేందుకు ‘తాత్కాలిక’ అనుమతులు మంజూరు చేసింది ఫేస్‌బుక్‌.  ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు కూడా ఈ పరిణామాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టొచ్చని గురువారం ప్రకటించింది మెటా సంస్థ.  రష్యన్ 'ఆక్రమణదారుల'పై హింసాత్మక ప్రసంగాన్ని అనుమతించే పోస్ట్‌లను ఫేస్‌బుక్ తాత్కాలికంగా అనుమతిస్తోంది అంటూ మెటా గురువారం సాయంత్రం ఒక నోట్‌ రిలీజ్‌ చేసింది. 

అయితే ఇదంతా రాజకీయపరంగానే, అదీ పరిధిలోకి లోబడే ఉండాలట!. దురాక్రమణకు మూలకారకులు, ఆయా దేశాల అధ్యక్షులను(రష్యా, బెలారస్‌ అధ్యక్షులను ఉద్దేశించి పరోక్షంగా..) సంబంధించి కామెంట్లను అనుమతిస్తాం. ఒకవేళ అవి ఫేస్‌బుక్‌ సాధారణ ఉల్లంఘనలను దాటినా చర్యలు తీసుకుంటాం. కానీ, సాధారణ పౌరులు, సైనికులను ఉద్దేశించి హింసాత్మక పోస్టులు పెడితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించం అని స్పష్టం చేసింది మెటా. 

ఈ తాత్కాలిక పాలసీలను అర్మేనియా, అజెర్‌బైజాన్‌, ఎస్టోనియా, జార్జియా, హంగేరీ, లాత్వియా, లిథువేనియా, పోల్యాండ్‌, రొమేనియా, రష్యా, స్లోవేకియా, ఉక్రెయిన్‌లకు వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. రష్యా తమ దేశంలో ఫేస్‌బుక్‌పై తాత్కాలిక నిషేధం విధించినా, యూజర్లు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకుంటున్నారు. అయితే రష్యా, ఉక్రెయిన్ మరియు పోల్యాండ్‌తో సహా పలు దేశాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్,  ఉక్రెయిన్‌ ఆక్రమణలో రష్యాకు అండగా ఉంటున్న బెలారస్‌ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకాషెంకో చావుకు సంబంధించి కొన్ని పోస్ట్‌లను కూడా ఫేస్‌బుక్‌ తాత్కాలికంగా అనుమతులు ఇవ్వడం గమనార్హం.

చదవండి: నూతన చట్టంతో ఉక్కుపాదం మోపిన రష్యా

మరిన్ని వార్తలు