బెస్ట్‌ డీల్‌.. దేశం కోసం.. ప్రజల కోసమే రష్యా ఆయిల్‌ను కొనేది : భారత్‌ స్పష్టత

17 Aug, 2022 12:26 IST|Sakshi

బ్యాంకాక్‌/ఢిల్లీ: రష్యాతో భారత్‌ చమురు వాణిజ్యంపై అమెరికా చల్లబడినట్లుగానే అనిపిస్తోంది. ఉక్రెయిన్‌ యుద్దం తర్వాత అగ్రరాజ్యంతో పాటు చాలా పాశ్చాత్య దేశాలు భారత్‌ మీద మండిపడ్డాయి. అయినప్పటికీ భారత్‌ మాత్రం తగ్గేదేలే అన్నచందాన ముందుకు వెళ్తోంది. ఏప్రిల్‌ నుంచి గరిష్ఠ స్థాయిలో చమురు వాణిజ్యం జరుగుతోంది ఇరు దేశాల మధ్య. ఈ  తరుణంలో రష్యాతో ఒప్పందం కొనసాగించాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న మరోసారి ఎదురైంది భారత్‌కు. 

మంగళవారం బ్యాంకాక్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ..  భారతీయులు చమురుకు అధిక ధరలు చెల్లించలేరని, అందుకే రష్యాతో ముడి చమురు ఒప్పందాలను కొనసాగిస్తున్నామని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం మేలిరకమైంది. భారత ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. 

ప్రతీ దేశం అధిక ఇంధన ధరలను తగ్గించడానికి సాధ్యమైనంత మేరకు.. ఉత్తమమైన ఒప్పందాలపై వైపు మొగ్గు చూపిస్తుంది. అలాగే భారత్‌ కూడా అదే పని చేసింది. ప్రస్తుతం ఆయిల్‌, గ్యాస్‌ ధరలు అధికంగా ఉన్నాయి. సంప్రదాయ పంపిణీదారులంతా యూరప్‌కు తరలిస్తున్నారు. అలాంటప్పుడు భారత్‌ ముందర ఇంతకన్నా మార్గం మరొకటి లేదని ఆయన నొక్కి చెప్పారు. 

నైతిక బాధ్యతగా పౌరుల గురించి ఆలోచించే తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని తేల్చి చెప్పారాయన. అంతేకాదు ఈ విషయం అమెరికాకు కూడా అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. రష్యాతో భారత్‌ చమురు వాణిజ్యంలో మొదటి నుంచి అమెరికా అభ్యంతరాలు చెబుతూ వస్తోంది. అయితే.. ఈ ఏప్రిల్‌లో అమెరికా, భారత్‌ మధ్య జరిగిన 2+2 స్థాయి సమావేశంలో.. రష్యాతో వాణిజ్యం గురించి అమెరికా నిలదీయడంతో.. భారత్‌ గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది.

ఇదీ చదవండి: హైదరాబాద్‌-బెంగళూరు మధ్య జర్నీ రెండున్నర గంటలే!!

మరిన్ని వార్తలు