సవతి తండ్రి నుంచి భర్తగా.. చెప్పలేని అకృత్యాలెన్నో!

26 Jun, 2021 16:57 IST|Sakshi

వలెరీ బకోట్‌.. ఫ్రాన్స్‌తో పాటుగా  ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న పేరు. మృగంలాంటి భర్త చేతిలో రెండు దశాబ్దాలపాటు ప్రత్యక్ష నరకం అనుభవించి.. చివరికి భరించలేక తుపాకీతో నేలకూల్చింది ఆ భార్యామణి. అయితే అది నేరమే అయినా.. లక్షల మందిని ఆమె కథ కదిలించింది. ఒక వ్యథలా ఆమె కథను కోర్టుకు చేర్చింది ప్రజాపోరాటం. ఫలితం.. న్యాయస్థానం ఆమెను క్షమించి వదిలేసింది. దీంతో ఈ కేసు అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించింది. 

ప్యారిస్‌: డేనియల్‌ పొలెట్టె.. ఛలోన్‌ సర్‌ సావన్‌లో ఉండే జోయిల్లె అవుబగే అనే ఆవిడతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటికే ఆవిడ విడాకులు తీసుకోవడంతో..  బాయ్‌ఫ్రెండ్‌గా ఆమెకు దగ్గరయ్యాడు. మగదిక్కు అవసరాన్ని ఆసరాగా తీసుకుని.. 1992లో వలెరీ బకోట్‌కు సవతి తండ్రి హోదాలో ఇంట్లో అడుగుపెట్టాడు. ఆపై మృగంగా మారి.. 12 ఏళ్ల వయసులో బకోట్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అది రాను రాను అతనికి అలవాటుగా మారింది. ఆపై జోయిల్లే నోరు మూయించి.. తన కంటే వయసులో పాతికేళ్లు చిన్నదైన బకోట్‌కు ఏకంగా భర్తగా మారిపోయాడు.

పిల్లలపై దాడి తట్టుకోలేక..
17 ఏళ్ల వయసుకే గర్భం దాల్చింది బకోట్‌. పొలెట్టెకు భార్యగా మారాక ఆమె జీవితం మరింత నరకప్రాయంగా మారింది. ట్రక్కు డ్రైవర్ల దగ్గరికి పంపిస్తూ.. ఆమెనొక వేశ్యగా మార్చేశాడు. నలుగురు పిల్లల తల్లి కావడంతో ఆమె ఏనాడూ తెగించి నిర్ణయం తీసుకోలేదు. చివరికి.. 2016లో ఓ రాత్రి పిల్లల ముందే ఆమెను దారుణంగా హింసించాడు. అడ్డొచ్చిన పిల్లలను చంపే ప్రయత్నం చేశాడు. అది తట్టుకోలేక తుపాకీతో పొలెట్టె కాల్చిపడేసి పీడను వదిలించుకుంది ఆమె. ఆపై పోలీసులు, కోర్టు ముందు కూడా తానే నేరస్థురాలినని ఒప్పుకుంది కూడా!

సెన్సేషన్‌ ఆటోబయోగ్రఫీ 
పొలెట్టె ఎంత నీచుడో అక్కడి ప్రజలకు తెలుసు. పద్దెనిమిదేళ్లపాటు ఆమెను ఘోరంగా హింసించాడు. అదే విషయాన్ని వివరిస్తూ వలెరీ తన ఆత్మకథను రాసింది. ‘‘టాట్‌ లె మోండే సావాయిట్‌(ఎవ్రీవన్‌ న్యు)’’ పుస్తకం ఈ మేలో పబ్లిష్‌ అయ్యింది. ‘‘నన్ను నేను, నా జీవితాన్ని, నా పిల్లల జీవితాన్ని రక్షించుకోవాలనుకున్నా. నేను అంతకన్నా ఎక్కువేం కోరుకోవట్లేదు’ అని ప్రకటించుకుందామె. ఆ బుక్‌ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. ఆమెపై సానుభూతి మొదలయ్యింది. ఆమెను రిలీజ్‌ చేయాలంటూ మొదలైన ఒక పిటిషన్‌పై ఏకంగా ఏడు లక్షల మంది సంతకాలు చేశారు.

దేశం నుంచి ఖండం.. 
బాకోట్‌కు నిబంధనల ప్రకారం న్యాయస్థానం నాలుగేళ్ల శిక్ష విధించాలి. కానీ, ఆ శిక్షలో మూడేళ్లు కోత వేసింది. ఇక మిగిలిన ఏడాదికి కూడా.. ఆమె ఇది వరకే జైలు నిర్భంధాన్ని అనుభవించిన కాలాన్ని లెక్కగట్టారు. దీంతో అప్పటికప్పుడే ఆమెను రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే.. బయట వందల మంది హర్షం వ్యక్తం చేశారు. సంబురంగా ఆమెను అభినందించారు. ‘‘ఆమె కథ ఫ్రాన్స్‌ను మాత్రమే కాదు.. యావత్‌ ఖండాన్ని కరిగించింది. గతంలో జాక్వెలిన్‌ సావేజ్‌ కేసు(బిడ్డను చంపిన భర్తను చంపేసింది.. శిక్షను తగ్గించి 2016లో క్షమాభిక్ష మీద విడుదల చేశారు).. ఈ కేసు ఒకేలా ఉండడం ఆమెకు కలిసొచ్చింది.’’ అని 40 ఏళ్ల బకోట్‌ తరపున పోరాడిన ఫ్లోరినా మెయిలీ చెబుతోంది.

చదవండి: ఆ స్కూల్‌ కింద నిండా సమాధులే!

మరిన్ని వార్తలు