గ్రీన్‌ కార్డు వెయిటింగ్‌ లిస్టు 195 ఏళ్లు

24 Jul, 2020 04:34 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో వలసదారులకు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పించే గ్రీన్‌ కార్డు కోసం భారతీయులు 195 ఏళ్లకు పైగా వేచి చూడాలని అధికార రిపబ్లికన్‌ సెనేటర్‌ మైక్‌ లీ చెప్పారు. ఈ సమస్యను చట్టబద్ధంగా పరిష్కరించడానికి ఇతర సెనేటర్లు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రీన్‌ కార్డు విధానంలో ఎన్నో లోపాలున్నాయని వలసదారుల పిల్లలకి దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు.

గ్రీన్‌ కార్డు బ్యాక్‌లాగ్‌లో చిక్కుకుపోయిన వలస ఉద్యోగుల పరిరక్షణ కోసం మరో సెనేటర్‌ డిక్‌ డర్బిన్‌ ప్రతిపాదించిన కొత్త చట్టంపై సెనేట్‌లో మైక్‌ లీ బుధవారం మాట్లాడారు. అమెరికాకు వలస వచ్చిన వారు గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేశాక వారు మరణిస్తే, వారి పిల్లలు నివాస యోగ్యతని కోల్పోతారని చెప్పారు. ‘‘భారత్‌ నుంచి వచ్చి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈబీ–3 కేటగిరీ గ్రీన్‌కార్డు కోసం 195 సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ వారి పిల్లలకు మనం ఆ హోదా కల్పించినా వారు ఎప్పటికీ అమెరికా పౌరులు కాలేరు’’అని లీ అన్నారు.

>
మరిన్ని వార్తలు