Heteroparental superfecundation: కవలలే గానీ... తండ్రులు వేరు

8 Sep, 2022 04:48 IST|Sakshi

బ్రెజిల్‌లో ఓ 19 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. ఇందులో విశేషం ఏముందంటారా? చాలా పెద్ద విశేషమే ఉంది. ఆ కవలలిద్దరికీ తండ్రులు వేర్వేరు! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే. సదరు యువతి ఒకే రోజున ఇద్దరు యువకులతో శారీరకంగా కలవడం ఇందుకు దారి తీసిందట!! పిల్లలకు 8 నెలలు వచ్చాక అసలు వారి తండ్రి ఎవరా అని ఆమెకు అనుమానం వచ్చింది. వారి తండ్రిగా తాను భావిస్తున్న యువకునికి పితృత్వ పరీక్ష చేయించగా కవలల్లో ఒకరి డీఎన్‌ఏతో మాత్రమే సరిపోయిందట.

దాంతో ఆమెతో పాటు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. కాసేపు ఆలోచించిన మీదట, తాను అదే రోజు మరో యువకునితో శారీరకంగా కలిసిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. డీఎన్‌ఏ పరీక్ష చేయించగా రెండో బాబుకు అతనే తండ్రి అని తేలింది! ‘‘ఇది అత్యంత అరుదైన సంగతి. 10 లక్షల్లో ఒక్క కేసులో మాత్రమే ఇలా జరిగేందుకు ఆస్కారముంటుంది’’ అని డాక్టర్లు చెబుతున్నారు.

శాస్త్రీయంగా దీన్ని హెటరో పేరెంటల్‌ సూపర్‌ ఫెకండేషన్‌ (బహుళ పిండోత్పత్తి)గా పిలుస్తారట. ఒకే రోజు ఇద్దరు పురుషులతో శారీరకంగా కలిసి, సదరు స్త్రీ తాలుకు రెండు అండాలు వారి వీర్య కణాలతో వేర్వేరుగా ఫలదీకరణ చెందితే ఇలా జరుగుతుందట. ఫలితంగా తయారయ్యే రెండు పిండాలూ వేర్వేరు మావి (ఉమ్మనీటి సంచి)లో పెరుగుతాయట. మనుషుల్లో అత్యంత అరుదే అయినా పలు జంతువుల్లో మాత్రం ఇది కాస్త సాధారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు