మితిమీరిన పైత్యం.. ఒళ్లంతా తూట్లు.. మానవ దెయ్యాలుగా భార్యభర్తలు

18 Jul, 2021 07:52 IST|Sakshi

కోరలు, కొమ్ములు కలగలిసిన ఆకారాన్ని  చూస్తే.. ఎలాంటివారికైనా ధైర్యం సడలకమానదు. అందుకే ప్రపంచమంతా మెచ్చే అందాన్ని కాదని ఆ ప్రపంచాన్నే  తమ రూపంతో వణికించాలనుకునే వెర్రిసాహసవంతులు  చాలా మందే తయారయ్యారు. ఒళ్లంతా టాటూలు పొడిపించుకుంటూ, రంధ్రాలు, బొడిపెలు పెట్టించుకుంటూ.. బాడీ మోడిఫికేషన్‌ పేరుతో నాలుక, చెవులు, ముక్కు ఇలా ఏదిపడితే అది కత్తిరించుకుని జనాలను జడిపిస్తున్నారు.  బ్రెజిల్‌కు చెందిన 44 ఏళ్ల మైఖెల్‌ ఫారో డో ప్రదోకు, అతడి భార్య కరోల్‌కు అలాంటి పైత్యమే పుట్టింది. ఇప్పటికే వాళ్లు తమ శరీరానికి ముప్పై వంకలు సృష్టించుకున్నారు. మరీముఖ్యంగా మిస్టర్‌ ప్రదో అయితే తలకు కొమ్ములు పెట్టించుకోవడమే కాకుండా నాలుకను రెండుగా చీల్చుకున్నాడు. తన పెదవులకు అటు ఇటు వెండి కోరలను కుట్టించుకున్నాడు.

ముక్కు, చెవులను కోయించుకున్నాడు. అప్పటికీ అతడి క్రియేటివ్‌ తృష్ణ సంతృప్తిపడలేదు.. క్రూరమైన రూపం కోసం.. ఏకంగా ఎడమ చేయి ఉంగరపు వేలుని కట్‌ చేయించు కున్నాడు. అతడిని అలా మార్చడంలో ప్రదో భార్య పాత్ర చాలానే ఉంది. ఎందుకంటే ఆమె బాడీ మోడిఫికేషన్స్‌లో నిపుణురాలు. ఆమె సలహాతోనే ఏడాది కిందట ముక్కు కొనను తొలగించుకునే అత్యంత ప్రమాదకరమైన శత్రచికిత్స చేయించుకున్నాడు.  ప్రపంచంలో ఆ ఆపరేషన్‌ చేయించుకున్న వారిలో మూడో వ్యక్తిగా నిలిచాడు మిస్టర్‌ ప్రదో.  ఇలాంటి వారికీ స్పెషల్‌ క్రేజ్‌ ఉంటుందట. వీరిని ‘హ్యూమన్‌ సైతాన్‌ (మానవ దెయ్యం)’ అంటారట.  అలా పిలిపించుకోవడమంటే ఎందుకంత పిచ్చో.. అలా శరీరాన్ని హింసించుకోవడంలో అదేం పైశాచికత్వామో మరి! కాదుకాదు.. ఇదొక రకమైన మానసిక దౌర్భల్యం అంటున్నారు మానసిక వైద్యనిపుణులు.

బాడీ మోడిఫికేషన్‌కి ముందు మైఖెల్‌

 
 

మరిన్ని వార్తలు