యుద్ధంలో రష్యా ఓడితే! జరిగేది ఇదే.. పుతిన్‌ భవిష్యత్‌పై మాజీ దౌత్యవేత్త

14 Mar, 2023 16:21 IST|Sakshi

చిన్న దేశం.. పైగా పెద్దగా సైనిక బలగం కూడా లేదు. మూడురోజులు.. కుదరకుంటే వారంలోపే ఆక్రమించేసుకోవచ్చు. ఉక్రెయిన్‌ దురాక్రమణకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వేసిన అంచనా ఇది. కానీ, ఆ అంచనా తప్పింది. ఏడాది పూర్తైనా యుద్ధం ఇరువైపులా నష్టం కలగజేస్తూ ముందుకు సాగుతోంది. పైగా చర్చలనే ఊసు కూడా కనిపించడం లేదు. ఈ తరుణంలో.. 

ఒకవేళ రష్యా గనుక యుద్ధంలో ఓడిపోతే పరిస్థితి ఏంటి?.. మరీ ముఖ్యంగా పుతిన్‌ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  దీనిపై.. రష్యా మాజీ దౌత్యవేత్త ఒకరు స్పందించారు. 

యుద్దంలో గనుక పుతిన్‌ ఓడిపోతే.. వెంటనే అధ్యక్ష పదవి నుంచి దిగిపోతాడు. ఆయనేం సూపర్‌ హీరో కాదు.. ఎలాంటి సూపర్‌పవర్స్‌ లేవు. ఆయనొక సాధారణ నియంత మాత్రమే. కాబట్టి, దిగిపోక తప్పదు అని బోరిస్‌ బోండరెవ్‌ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బోండరెవ్‌.. జెనెవాలో రష్యా దౌత్యపరమైన కార్యకలాపాలకు సంబంధించి ఆయుధాల నియంత్రణ నిపుణుడిగా బాధ్యతలు నిర్వహించేవారు. అయితే..  ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఖండిస్తూ ఈయన తన పదవికి రాజీనామా చేశారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఖండిస్తూ.. బహిరంగంగా రాజీనామా చేసిన తొలి దౌత్యవేత్త, అదీ రష్యా పౌరుడు కావడం ఇక్కడ గమనార్హం. 

‘‘చరిత్రను గనుక ఓసారి తిరగేస్తే.. నియంతలు ఎక్కడా శాశ్వతంగా కనిపించరు. వాళ్లు పూర్తిస్థాయిలో అధికారం కొనసాగించిన దాఖలాలు లేవు. యుద్ధంలో ఓడితే గనుక.. మద్దతుదారుల అవసరాలను తీర్చలేక వాళ్లంతట వాళ్లే పక్కకు తప్పుకుంటారు. పుతిన్‌ కూడా ఒక సాధారణ నియంతే. రష్యా యుద్ధంలో గనుక ఓడిపోతే..  పుతిన్ తన దేశానికి ఏమీ ఇవ్వలేడు. ప్రజల్లోనిరాశ, అసమ్మతి పేరుకుపోతుంది. రష్యా ప్రజలు ఇకపై పుతిన్ అవసరం తమకు లేదని అనుకోవచ్చు. అప్పుడు ఆయనకు వీడ్కోలు పలికేందుకే మొగ్గు చూపిస్తారు కదా అని అభిప్రాయపడ్డారు బోండరెవ్‌. అయితే.. ప్రజలను భయపెట్టడం లేదంటే అణచివేత ద్వారా మాత్రమే పుతిన్‌ ఆ పరిస్థితిని మార్చేసే అవకాశం మాత్రం ఉంటుంది అని తెలిపారాయన. 

మరిన్ని వార్తలు