చిరుత కుటుంబం ఇంత సన్నిహితమా?

17 Oct, 2023 10:26 IST|Sakshi

వన్యప్రాణులకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు, వీడియోలను తరచూ పంచుకునే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి పర్వీన్ కస్వాన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పర్షియన్ చిరుతపులి కుటుంబానికి సంబంధించిన ఫుటేజీని షేర్‌ చేశారు. తుర్క్‌మెనిస్తాన్‌ వన్యప్రాణి సంరక్షకుడు నరిన్‌ టి రోసెన్‌ ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరా ద్వారా ఈ దృశ్యాలు చిత్రీకరించారు.

చిరుతపులి ఉపజాతిలో పర్షియన్ చిరుతపులి అతిపెద్దది. ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉంది. ప్రపంచంలో వెయ్యికి తక్కువగానే ఈ జాతి చిరుతపులులు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ‘పర్షియన్ చిరుతపులి కుటుంబం వసతి ఏ‍ర్పాటు చేసుకోవాలనుకుంటున్నప్పుడు.. ట్రాప్ కెమెరా ముందు.. మీరు చూస్తున్న ఈ అద్భుత వీడియో గొప్పదనం @NarynTRకి చెందుతుంది’ అంటూ వీడియోకు క్యాప్షన్‌ జతచేశారు.  

ఈ అరుదైన వీడియోలో నాలుగు పర్షియన్ చిరుతపులుల కుటుంబం విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తుంది. చిరుతపులి కూనలు చేస్తున్న సౌండ్స్‌ కూడా ఈ వీడియోలో వినిపిస్తాయి. ఇంటర్నెట్ యూజర్స్‌ ఈ వీడియోను అమితంగా ఇష్టపడుతున్నారు.

ఒక యూజర్‌ ఇలా రాశాడు ‘వావ్.. ఇది నిజంగా అద్భుతం. ప్రకృతి ఒడిలో పర్షియన్ చిరుతపులి కుటుంబం’. మరొక యూజర్‌ ‘నేను చాలా కాలం తరువాత చూసిన అద్భుతం’ అని రాశారు. 

కాగా ట్రాప్ కెమెరా అనేది ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌కు జోడించిన డిజిటల్ కెమెరా. ఇది వన్యప్రాణులు, వాటి ఆవాసాలు, జాతుల స్థానం, జనాభా పరిమాణం, జాతుల పరస్పర చర్యలకు సంబంధించిన డేటాను పొందుపరుస్తుంది. ఏదైనా జంతువు కెమెరా సెన్సార్ దగ్గరికు వెళ్ళినప్పుడు అది కెమెరాను ట్రిగ్గర్ చేస్తుంది. తర్వాత వీడియోను రికార్డ్ చేస్తుంది.
ఇది కూడా చదవండి: 72 ఏళ్ల క్రితం మూసిన ఆలయం తెరవగానే..
 

మరిన్ని వార్తలు