పెట్టుబడుల కేంద్రం విశాఖ | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల కేంద్రం విశాఖ

Published Tue, Oct 17 2023 10:22 AM

Visakhapatnam is the center of investment - Sakshi

దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మొదటి వరుసలో నిలిచిన విశాఖ నగరం పారిశ్రామికంగా, వాణిజ్య కేంద్రంగా ఎదుగుతోందని ఐటీ దిగ్గజ నిపుణులు పేర్కొన్నారు. సోమవారం విశాఖలో ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి నీలాంజన్‌ రాయ్, వైస్‌ ప్రెసిడెంట్స్‌æ నీలాద్రి ప్రసాద్‌ మిశ్రా, రఘు బొడ్డుపల్లి తదితరులు ముఖ్యమంత్రి జగన్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్‌ డేటా సెంటర్‌ పని తీరును వివరించారు. అనంతరం సంస్థ ఉద్యోగులను పలుకరించిన సీఎం జగన్‌ వారితో మాట్లాడారు.  – సాక్షి, విశాఖపట్నం

హైబ్రీడ్‌ వర్కింగ్‌ మోడల్‌లో..
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి డెవలప్‌మెంట్‌ సెంటర్‌ని విశాఖలో ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ మొదటి వరసలో ఉంది. నగరానికి అన్ని మార్గాల్లోనూ ప్రపంచస్థాయి కనెక్టివిటీ ఉంది. పారిశ్రామికంగా, వాణిజ్య కేంద్రంగా వైజాగ్‌ అభివృద్ధి చెందింది. విశాఖ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచింది. ఇక్కడ మా కార్యకలాపాలను ప్రారంభించేందుకు పూర్తి సహాయ, సహకారాలు అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. వర్క్‌స్పేస్‌ను ఇన్ఫోసియన్స్‌కు దగ్గరగా తేవాలనే ఉద్దేశంతో హైబ్రిడ్‌ వర్కింగ్‌ మోడల్‌లో ముందుకు తీసుకెళుతున్నాం. దాదాపు 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన వైజాగ్‌ కేంద్రం హైబ్రీడ్‌ మోడ్, ఇంటికి దగ్గరగా పని చేయడానికి ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ నూతన కేంద్రం క్లౌడ్, కృత్రిమ మేథ, డిజిటల్‌ లాంటి టెక్నాలజీల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను అందిపుచ్చుకోవడం, స్థానిక ప్రతిభను ఆకర్షించడం, రీ–స్కిల్, అప్‌–స్కిల్‌ కోసం దోహదం చేస్తుంది. సుమారు 1,000 మంది ఉద్యోగులకు తగిన సదుపాయాలు కల్పించేలా దీన్ని రూపొందించాం. 
– నీలాంజన్‌ రాయ్, ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌

 నా విశాఖ.. నా ఇన్ఫోసిస్‌
నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా వైజాగ్‌లోనే అయినా హైదరాబాద్, బెంగళూరులో 20 ఏళ్లుగా ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్నాను. నా సొంత ఊరిలో నా సంస్థ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని కలలు కనేవాడిని. ఇన్నాళ్లకు నా కలని నిజం చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇన్ఫోసిస్‌ పెద్దలకు కృతజ్ఞతలు.  – సతీష్‌ సూరి, ఇన్ఫోసిస్‌ ఉద్యోగి

చెప్పలేనంత సంతోషం
నమస్తే సీఎం సర్‌. ఇన్ఫోసిస్‌లో రెండేళ్లుగా పని చేస్తున్నా. మా ఊరిలో పని చేయాలన్నది నా డ్రీమ్‌. ఇన్ఫోసిస్‌ లాంటి పెద్ద కంపెనీ మా సొంత ఊరికి రావడం, అందులో పని చేయడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
– వనిత, ఇన్ఫోసిస్‌ ఉద్యోగి  

Advertisement
Advertisement