కళ్లు తెరవండి..లేదంటే 10 లక్షల మరణాలు: లాన్సెట్‌ హెచ‍్చరిక

8 May, 2021 20:05 IST|Sakshi

జాతీయ విపత్తుకు మోదీ సర్కార్‌దే బాధ్యత

భారత్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి

కరోనా కట్టడిలో మోదీ  ప్రభుత్వం తీవ్ర వైఫల్యం 

ఇప్పటికైనా మేల్కొనపోతే ఆగస్టు 1 నాటికి 10 లక్షల మరణాలు 

సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో రెండో దశలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావంపై ఇప్పటికే పలు నివేదికలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా అధ్వాన పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ది లాన్సెట్ సంచలన విషయాలను వెల్లడించింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో శుక్రవారం ప్రచురించిన సంపాదకీయంలో  కరోనా  కారణంగా   ఆగస్టు 1 నాటికి భారతదేశంలో 10 లక్షల మరణాలు నమోదు కానున్నాయంటూ   అంచనా వేసింది.  దీనిలో భాగంగా మే 4వ తేదీ నాటికి దేశంలో  వెలుగు చూసిన  2కోట్లకు పైగా కేసులు, సంభవిస్తున్న మరణాలను గుర్తు చేసింది.  

ఈ నేపథ్యంలో సరైన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే ఆగస్టు 1వ తేదీ నాటికి 10 లక్షల మరణాలు సంభవిస్తాయని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ అంచనా వేసిందని లాన్సెట్‌ తెలిపింది. ఒకవేళ  ఇదే జరిగితే ఈ జాతీయ విపత్తుకు కేంద్రీంలోని మోదీ సర్కారే బాధ్యత వహించాలని పేర్కొంది. అంతేకాదు ఈ సంక్షోభ సమయంలో విమర్శలకు తొక్కిపెట్టడానికి, ప్రయత్నించిన తీరు క్షమించరానిదని లాస్సెట్‌ వ్యాఖ్యానించింది.  

భారతదేశంలో  కోవిడ్‌-19 అత్యవసర పరిస్థితులున్నాయని తెలిపింది. ఒక పక్క బాధితులతో ఆసుపత్రులన్నీనిండిపోతున్నాయి. మరోపక్క మందులు, బెడ్లు, ఆక్సిజన్‌ అందక రోగులు అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి. చివరికి  చికిత్స అందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు,  వైద్యులు మహమ్మారి బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అసలు కోవిడ్‌ నియంత్రణకు మోదీ సర్కార్‌ ఎటువంటి చర్యలు చేపట్టడంలేదని మండిపడింది. ఏప్రిల్‌ వరకు కూడా కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌తో సమావేశం కాలేదంటేనే ప్రభుత్వ నిబద్దత అర్ధమౌతోందంటూ చురకలు వేసింది. తద్వారా భారత్ తన ప్రారంభ విజయాలను తానే నాశనం చేసుకుందని వ్యాఖ్యానించింది.

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే  ఈ సంక్షోభం ఏర్పడిందంటూ విమర్శలు గుప్పించింది.  అనేక హెచ్చరిక సంకేతాలు ఉన్నప్పటికీ, మతపరమైన ఉత్సవాలు (కుంభమేళా) రాజకీయ ర్యాలీలు వంటి సూపర్-స్ప్రెడర్ కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతించిందని ఆగ్రహం వ్యక్తం  చేసింది.  అలాగే కేంద్రంపై వ్యతిరేకత వ్యక్తం చేసిన ట్వీట్లను తొలగించాలని ట్విటర్‌కు ఆదేశాలు ఇచ్చిందని పేర్కొంది. ఈ సమయంలో భారత్ గతంలో సాధించిన విజయాల పట్ల కాకుండా ప్రస్తుతం పరిస్థితులకనుగుణంగా మేల్కోవాలని, బాధ్యతాయుతమైన నాయకత్వం,  పాదర్శకతతో కూడిన పాలనను అందించాలని కోరింది. 

ఇప్పటికైనా భారతదేశం తన టీకా సరఫరాను పెంచాలని, కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో టీకాను విరివిగా అందించాలని తెలిపింది. కరోనా వైరస్ విస్తరణ రేటును అరికట్టాల్సిన అవసరం ఉందని కూడా ఇది పేర్కొంది.  ఇందుకోసం ఖచ్చితమైన డేటాను సకాలంలో ప్రచురించాలి. అసలు ఏమి జరుగుతుందో ప్రజలకు ఖచ్చితంగా చెప్పాలి. మహమ్మారి విస్తరణను నిలువరించేందుకు  దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సహా,  టీకా, మాస్క్‌,  భౌతిక దూరం, స్వచ్చంధ నిర్బంధం, పరీక్షల ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని హితవు పలికింది.  

చదవండి:  కరోనా విలయం: డీఆర్‌డీవో డ్రగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌
శుభవార్త: త్వరలోనే నాలుగో వ్యాక్సిన్‌?!

మరిన్ని వార్తలు