ఇంగ్లీష్‌ మాట్లాడలేక అడ్డంగా దొరికిపోయి.. అమెరికాలో భారత్‌ పరువు తీశారు

3 Aug, 2022 16:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అహ్మదాబాద్‌: అగ్రరాజ్యం గడ్డపై భారత్‌ పరువు పోయిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంగ్లీష్‌ భాష సామర్థ్యపు పరీక్ష ఐఈఎల్‌టీఎస్‌లో అర్హత సాధించిన ఆరుగురు భారతీయ విద్యార్థులు.. అమెరికాలో అక్రమ చొరబాటుకు ప్రయత్నించడంతో పాటు కోర్టులో ఇంగ్లీష్‌లో సమాధానాలు ఇవ్వలేక మౌనంగా ఉండిపోయారు. దీంతో అమెరికా నేరవిభాగం ఆదేశాలతో.. ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష అవకతవకలపై గుజరాత్‌ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. 

రెండు వారాల కిందట..  అమెరికా-కెనడా సరిహద్దులో అక్వేసాసేన్‌ వద్ద సెయింట్‌ రెగిస్ నదిలో మునిగిపోతున్న ఓ పడవ నుంచి కొందరిని అమెరికా సిబ్బంది రక్షించారు. అందులో ఆరుగురు భారత విద్యార్థులు ఉన్నారు. అయితే ఆ ఆరుగురు జడ్జి అడిగిన ప్రశ్నలకు ఇంగ్లీష్‌లో సమాధానాలు ఇవ్వలేక తడబడ్డారు. దీంతో అప్పటికప్పుడు ఓ హిందీ ట్రాన్స్‌లేటర్‌ సాయంతో కోర్టు వాళ్ల నుంచి వాంగ్మూలం సేకరించింది.

కెనడా నుంచి వాళ్లు అక్రమంగా అమెరికాలోకి చొరబడాలని ప్రయత్నించినట్లు తేలింది. అయితే ఐఈఎల్‌టీఎస్‌లో వీళ్లు 6.5 నుంచి 7 మధ్య స్కోర్‌ చేశారని తెలియడంతో కోర్టు సైతం ఆశ్చర్యపోయింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ముంబైలోని అమెరికా క్రిమినల్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌.. దర్యాప్తు చేపట్టాల్సిందిగా మెహ్‌సనా(గుజరాత్‌) పోలీసులకు మెయిల్‌ చేసింది. 

► ఇంటర్నేషనల్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్ IELTS‌.. ఇంగ్లీష్‌ సామర్థ్యాన్ని నిరూపించుకునే పరీక్ష. చాలా దేశాల్లో మంచి కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షలో మంచి స్కోర్‌ అవసరం కూడా. అయితే.. 

► భారతీయ విద్యార్థుల అక్రమ చొరబాటు వార్త వెలుగులోకి రావడంతో సోషల్‌ మీడియాలో భిన్న చర్చ నడిచింది. జుగాద్‌ కల్చర్‌ అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లారంటూ కొందరు సెటైర్లు పేలుస్తుంటే.. పరీక్షలో మోసం చేసి న్యూజెర్సీ దాకా వెళ్లి మరీ భారత దేశ పరువు తీశారని, మరికొందరు విద్యార్థుల ప్రయత్నాలపై ఇది ప్రభావం చూపెడుతుందని అంటున్నారు. 

► విద్యార్థులంతా 19 నుంచి 21 ఏళ్లలోపు వాళ్లే. వారిలో నలుగురు దక్షిణ గుజరాత్‌ నవసారీ టౌన్‌లో సెప్టెంబర్‌ 25, 2021లో పరీక్ష రాశారని పోలీసులు ధృవీకరించారు. స్టూడెంట్‌ వీసా మీద మార్చి 19న కెనడాకు వెళ్లారు. అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందారు. ఆపై అక్రమంగా అమెరికాలోకి చొరబడే ప్రయత్నాలు చేస్తూ.. రెండు వారాల కిందట యూఎస్‌-కెనడా సరిహద్దులో అడ్డంగా దొరికిపోయారు. 

ఇక ఈ ఘటనపై గుజరాత్‌ పోలీసులు స్పందించారు. IELTS పరీక్ష జరిగిన రోజున.. నవసారీ టౌన్‌లోని ఎగ్జామ్‌ సెంటర్‌లోని సీసీటీవీ కెమెరాలన్నీ ఆఫ్‌లో ఉన్నాయని స్థానిక అధికారి రాథోడ్‌ తెలిపారు. విచారణలో భాగంగా విద్యార్థులు పరీక్షలకు హాజరైన ఏజెన్సీ నిర్వాహకులను సైతం పిలిపించుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇక ఈ రాకెట్‌ గుట్టువీడడంతో మరో మూడు కేంద్రాలను సైతం పరీలిస్తున్నారు కూడా. 

మరిన్ని వార్తలు