ఇసుకవేస్తే రాలనంత జనం.. జకార్తా టూ నుసంతర.. ఇండోనేసియాకు కొత్త రాజధాని

12 Mar, 2023 14:14 IST|Sakshi
జోరుగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు

యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు

ఫారెస్ట్‌ సిటీ కాన్సెప్ట్‌తో కొత్త రాజధాని

పర్యావరణప్రియుల ఆందోళన

ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి తరలిపోతోంది. బోర్నియో ద్వీపంలో నుసంతర పేరిట కొత్త రాజధాని నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేయింబవళ్లు పనులు కొనసాగిస్తోంది.

ఈ కొత్త రాజధాని జకార్తాకు ఈశాన్యంగా 2 వేల కిలోమీటర్ల దూరంలో బోర్నియో ద్వీపంలో పచ్చని అటవీ ప్రాంతమైన కాలిమాంటన్‌లో కొలువుదీరనుంది. దీన్ని కాలుష్యరహిత, సతత హరిత నగరంగా రూపొందిస్తున్నారు. అయితే దీనిపై పర్యావరణవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త రాజధాని నిర్మాణంతో ఆ ప్రాంతంలో అటవీ సంపద తరిగిపోయి వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా పోతుందని, పర్యావరణంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని వారంటున్నారు.   

జకార్తా ఇసుకవేస్తే రాలనంత జనాభాతో కిటకిటలాడుతోంది. రాజధానిలో కోటి మందికి పైగా జనాభా నివసిస్తారు. మెట్రోపాలిటన్‌ ప్రాంతాన్నీ కలిపితే 3 కోట్ల దాకా ఉంటారు. భరించలేని కాలుష్యం రాజధాని వాసుల్ని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో జకార్తా అగ్ర భాగంలో ఉంటోంది. ఇక అత్యంత వేగంగా కుంగిపోతున్న నగరాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2050 నాటికి జకార్తాలో మూడింట ఒక వంతు సముద్రంలో మునిగిపోతుంది.

దీనికి తోడు ఇండోనేసియాకు భూకంపాల ముప్పు ఉండనే ఉంది. అన్నింటి కంటే రాజధాని మార్పుకు మరో ముఖ్య కారణం అడ్డూ అదుపు లేకుండా భూగర్భ జలాల వెలికితీయడం. దీనివల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడి వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా ఏటా 450 కోట్ల డాలర్లు నష్టం వాటిల్లితోంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని జకార్తా నుంచి బోర్నియోకు రాజధానిని మార్చేయాలని అధ్యక్షుడు జోకో విడొడొ గతేడాది ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించారు.

పర్యావరణవేత్తలు ఏమంటున్నారు?
కొత్త నగర నిర్మాణ ప్రాంతం అరుదైన వృక్షజాలం, జంతుజాలానికి ఆలవాలం. ఇప్పుడు వాటి ఉనికి ప్రమాదంలో పడనుంది. నగర నిర్మాణానికి చెట్లను కూడా భారీగా కొట్టేస్తున్నారు. రాజధాని కోసం ఏకంగా 2,56,142 హెక్టార్ల అటవీ భూమిని సేకరిస్తున్నారు. ఇవన్నీ పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపేవే. పైగా ఈ అడవుల్లో దాదాపుగా 100 గిరిజన తెగలు నివాసం ఉంటున్నాయి. వారందరికీ పునరావాసం, నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో అన్నీ సరిగ్గా అమలయ్యే అవకాశం లేదన్న ఆందోళనలున్నాయి.

రాజధానిని మార్చిన దేశాలివే..!
గతంలో ఎన్నో దేశాలు పలు కారణాలతో రాజధానుల్ని మార్చాయి...
► రాజధాని దేశానికి నడిబొడ్డున ఉండాలన్న కారణంతో బ్రెజిల్‌ 1960లో రియో డిజనిరో నుంచి బ్రెసీలియాకు మార్చింది.
► 1991లో నైజీరియా లాగోస్‌ నుంచి అబూజాకు రాజధానిని మార్చుకుంది.
► 1997లో కజకిస్తాన్‌ కూడా అల్మటి నుంచి నూర్‌–సుల్తాన్‌కు రాజధానిని మార్చింది. కానీ ఇప్పటికీ అల్మటీయే వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.
► మయన్మార్‌ రంగూన్‌ నుంచి రాజధానిని నేపిడాకు మార్చింది.

కొత్త రాజధాని ఎలా ఉంటుంది?
కొత్త రాజధాని నిర్మాణాన్ని అధ్యక్షుడు విడొడొ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక సుస్థిర నగరంలో అందరూ కొత్త జీవితాల్ని ప్రారంభించాలని ఆయన ఆశపడుతున్నారు. ఫారెస్ట్‌ సిటీ కాన్సెప్ట్‌తో హరిత నగరాన్ని నిర్మించనున్నారు. నగరంలో 65% ప్రాంతంలో ఉద్యానవనాలే ఉంటాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని స్మార్ట్‌ నగరంగా కూడా తీర్చిదిద్దనున్నారు. సౌర విద్యుత్, జల సంరక్షణ విధానాలు, వ్యర్థాల నిర్వహణ వంటివన్నీ కొత్త సాంకేతిక హంగులతో ఉంటాయి. ప్రస్తుతానికి ఐదు గిరిజన గ్రామాలను ఖాళీ చేయించి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ ఏడాది 184 ప్రభుత్వ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కొత్త రాజధాని నుసంతరను అటవీ నగరం కాన్సెప్ట్‌తో ప్రణాళికాబద్ధంగా కడుతున్నాం. 65% ప్రాంతం పచ్చదనానికే కేటాయిస్తున్నాం. 2024 ఆగస్టు 17 స్వాతంత్య్ర దిన వేడుకలను కొత్త రాజధానిలో జరిపేలా సన్నాహాలు చేస్తున్నాం.
– బాంబాంగ్‌ సుసాంటొనొ, నుసంతర నేషనల్‌ కేపిటల్‌ అథారిటీ చీఫ్‌

అధ్యక్ష భవనం నమూనా
కొత్త రాజధాని నిర్మాణ అంచనా వ్యయం:    3,200 కోట్ల డాలర్లు  
రాజధాని నిర్మాణంలో ప్రైవేటు పెట్టుబడులు:    80%
ఈ ఏడాది నిర్మాణం జరుపుకునే భవనాలు:    184
ప్రస్తుతం నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు:    7 వేలు  
తొలి దశలో తరలివెళ్లే ప్రజలు సంఖ్య:    15 లక్షలు  
అధ్యక్ష భవనం నిర్మాణం పూర్తయ్యేది:    2024 ఆగస్టు 17
    (దేశ స్వాతంత్య్ర దినోత్సవం)
రాజధాని నుసంతర నిర్మాణం పూర్తయ్యేది:    2045 ఆగస్టు 17
    (దేశ వందో స్వాతంత్య్ర దినం)

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు