జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే రాజీనామా!

28 Aug, 2020 11:54 IST|Sakshi

టోక్యో: జపాన్ ప్ర‌ధాని షింజో అబే రాజీనామా చేయనున్నట్టు సమాచారం.  తీవ్ర అనారోగ్యం వల్లనే ఆయన ప‌ద‌వి నుంచి వెదొలుగుతున్న‌ట్టు తెలిపింది. ఈ విష‌యాన్ని జపాన్ జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కె శుక్రవారం ధ్రువీక‌రించింది. దీంతో ప్ర‌స్తుత‌ం ఉప ప్రధానిగా ఉన్న తారో అసో తాత్కాలిక ప్రధానిగా బాద్యతలు చేపట్టనున్నారు. నాలుగు రోజుల క్రితం తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రధాని షింజో అబే టోక్యోలోని ఆస్పత్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న ఆరోగ్యంపై ప‌లు ఊహాగానాలు తెర‌పైకి వ‌చ్చాయి. అయితే ఈ వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఆయన కేవలం జనరల్‌ చెకప్‌ కోసం వచ్చినట్లు, అబే ఆరోగ్యం క్షేమంగానే ఉందని ఆర్థికమంత్రి కట్సునోబు కటో తెలిపారు. దీంతో ప్ర‌ధాని రాజీనామా చేయ‌నున్నారనే వార్తలకు ‌బలం చేకూర్చిన‌ట్ల‌యింది.
 (ఆస్పత్రిలో చేరిన జపాన్‌ ప్రధాని.. రాజీనామా!)

త‌న అనారోగ్యం ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌కు ఇబ్బందిగా మార‌కూడ‌ద‌నే ప్ర‌ధాని షింజో భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రికాసేప‌ట్లో దీనికి సంబంధించి ఆయ‌న మీడియాతో మాట్లాడే అవ‌కాశం ఉంది. 2021 సెప్టెంబ‌రు వ‌ర‌కు ప్ర‌ధానిగా ఆయన ప‌ద‌వీకాలం ఉంది. ఇదిలా ఉండగా దేశంలో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా అబే రికార్డు సృష్టించారు. తొలుత 2006లో సంకీర్ణ ప్రభుత్వం తరఫున ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అబే.. కూటమిలో విభేదాలతో 2007లో రాజీనామా చేశారు. తిరిగి 2012లో రెండోసారి ప్రధానిగా ఎన్నికై అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే క‌రోనా మ‌హమ్మారిపై నియంత్ర‌ణ‌, అధికార పార్టీ నేత‌ల అవినీతి కుంభ‌కోణం లాంటివి షింజో అబేను ఇరుకున పెట్టాయి. దీంతో బ‌హిరంగంగానే ప్ర‌ధానిని కుర్చీలోంచి దిగిపోవాలంటూ ప‌లువురు నిర‌స‌న తెలిపారు. అయితే ద్ర‌వ్య స‌డ‌లింపు విధానంతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ద‌రిస్తానంటూ షింజో ఓ స‌మావేశంలో పేర్కొన్నాడు. కానీ గ‌త కొంత కాలంగా ఆయ‌న‌ను వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇక అధ్య‌క్షుని హోదా నుంచి వైదొల‌గ‌క త‌ప్ప‌లేదు. (గుడ్‌ న్యూస్‌ చెప్పిన జపాన్‌ శాస్త్రవేత్తలు)

మరిన్ని వార్తలు