టెక్సాస్‌ కాల్పుల ఘటన.. ‘గన్‌ లాబీకి ఎదురు నిలబడబోతున్నాం’.. బైడెన్‌ భావోద్వేగం

25 May, 2022 09:07 IST|Sakshi

Texas School Shooting, వాషింగ్టన్‌: టెక్సాస్‌లోని ఎలిమెంటరీ స్కూల్‌లో 19 మంది చిన్నారులను దుండగుడు కాల్చిచంపిన ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దేశంలోని శక్తివంతమైన తుపాకీ లాబీకి వ్యతిరేకంగా అమెరికన్లు నిలబడాలని మంగళవారం ఆయన పిలుపునిచ్చారు.

దేవుడి పేరుతో మనం ఎప్పుడు గన్‌ లాబీకి ఎదురు నిలబడబోతున్నాం అంటూ వైట్‌హౌజ్‌ నుంచి ఆయన ప్రసంగించారు. ఈ బాధను ప్రతి తల్లిదండ్రులకు, ఈ దేశంలోని ప్రతి పౌరునికి చర్యగా మార్చాల్సిన సమయం.. ఇదే. ఈ దేశంలో ఎన్నికైన ప్రతి అధికారికి(సెనేటర్‌లను ఉద్దేశిస్తూ..) మనం స్పష్టంగా తెలియజేయాలి. ఇది పని చేయాల్సిన తరుణం అంటూ ఆయన పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా చనిపోయిన తన మొదటి భార్య, పిల్లలను ఆయన గుర్తు చేసుకున్నారు. 1972లో ఓ కారు ప్రమాదంలో బైడెన్‌ భార్య, కూతురు చనిపోయారు. 2015లో ఆయన కొడుకు కేన్సర్‌తో కన్నుమూశాడు. తల్లిదండ్రులకు పిల్లలు శాశ్వతంగా దూరం కావడం అంటే.. అది వాళ్ల గుండెకు మాయని గాయం.. కొంతకాలం దాకా కోలుకోలేని క్షోభ అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. గన్‌ కల్చర్‌ కట్టడికి ‘ఘోస్ట్‌ గన్స్‌’ చట్టం చేసింది బైడెన్‌ ప్రభుత్వం. అయితే దీనికి రాజకీయపరంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇల్లీగల్‌ కంపెనీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు సెనేటర్ల వల్లే ఈ చట్టం సమర్థవంతంగా అమలు కాలేకపోతోందని బైడెన్‌ ప్రభుత్వం చెబుతోంది.
  
ఇక చాలూ.. కమలాహ్యారీస్‌
Texas School Shooting ఘటనపై అమెరికా వైస్‌ప్రెసిడెంట్‌ కమలాహ్యారీస్‌ స్పందించారు. ఇలాంటి ఘటనలు ఇక చాలని.. దేశం మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె వ్యాఖ్యానించారు. మన గుండెలు బద్ధలు అవుతూనే ఉన్నాయి. చర్యలు తీసుకోవడానికి ధైర్యం చేయాలి అని వ్యాఖ్యానించారామె. 

18 ఏళ్ల గన్‌మ్యాన్‌.. టెక్సాస్‌ యువాల్డేలో ఎలిమెంటరీ స్కూల్‌పై విరుచుకుపడి.. 19 మంది పిల్లలను, మరో ఇద్దరిని పొట్టనబెట్టుకున్నాడు. ఘటనకు ముందు తన బామ్మను సైతం నిందితుడు కాల్చి చంపినట్లు తెలుస్తోంది.  సిబ్బంది నిందితుడిని కాల్చి చంపగా.. గన్‌కల్చర్‌ పేట్రేగిపోవడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.

మరిన్ని వార్తలు