అమెరికా 46వ అధ్యక్షుడు బైడెన్‌

16 Dec, 2020 02:13 IST|Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం అధికారికంగా నిర్ధారణ అయింది. 538 మంది  సభ్యుల ఎలక్టోరల్‌ కాలేజీలో 306  ఓట్లతో బైడెన్‌ ముందంజలో నిలబడగా, ట్రంప్‌కి 232 ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్‌ విజయం మరోమారు నిర్ధారణ అయ్యింది. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు నిర్ధారణ అయితే తప్ప వైట్‌ హౌస్‌ని ఖాళీచేయనని కరాఖండీగా చెప్పిన ట్రంప్‌ శ్వేత సౌధాన్ని వీడే రోజొచ్చింది. దీంతో జోబైడెన్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు అత్యంత కీలకమైన అడుగు ముందుకు పడినట్లయ్యింది. ఫలితాలు తారుమారవుతాయని భావించిన ట్రంప్‌ అభిప్రాయం తల్లకిందులయ్యింది. రాజ్యాంగం, రూల్‌ ఆఫ్‌ లా, ప్రజాభీష్టం మరోమారు రుజువయ్యిందని జోబైడెన్‌ తన నివాసం నుంచి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘‘అమెరికాలో ఎన్నో ఏళ్ళ క్రితమే ప్రజాస్వామ్యమనే దీపాన్ని వెలిగించారు.

ప్రతి అమెరికా పౌరుల హృదయాల్లోకి ప్రజాస్వామ్యం అనే పదం చేరిపోయింది. ఏ మహమ్మారీ, ఎంతటి అధికార దుర్వినియోగం ఆ  దీపాన్ని ఆర్పలేవు. ఈ యుద్ధంలో అమెరికా ప్రజాస్వామ్యం గెలిచింది. అమెరికా ఐక్యత కోçసం ఇక పేజీ తిప్పేయాల్సిందే’’ అని జో బైడెన్‌ అన్నారు. 8.1 కోట్ల మంది వోటర్లు ఓట్లు వేశారు. ఈ స్థాయిలో ఓట్లు రావడం అమెరికా చరిత్రలో తొలిసారి. తాను అమెరికా ప్రజలందరికీ అధ్యక్షుడిగా ఉంటానని, ఓట్లు వేయని వారికోసం మరింత శ్రమిస్తానని బైడెన్‌ వ్యాఖ్యానించారు. అయితే 2016లో డొనాల్డ్‌ ట్రంప్, పెన్స్‌లకు కూడా బైడెన్‌కి, కమలా హారిస్‌కి వచ్చిన 306 ఓట్లే వచ్చాయి. మహమ్మారి విజృంభిస్తోన్న  ఈ  విషాద శీతాకాలాన నా హృదయం మీ అందరి కోసం తపిస్తోంది. మీకు అత్యంత ఆప్తులైన వారు లేకుండా, నూతన సంవత్సరాన్నీ జరుపుకోబోతున్నారు’’ అని కోవిడ్‌ మృతుల కుటుంబాలకు బైడెన్‌ సంతాపాన్ని వ్యక్తం ప్రకటించారు.  

మరిన్ని వార్తలు