పార్లమెంట్‌లో నాజీ వెటరన్‌పై ప్రశంసలు.. కెనడా ప్రధాని ట్రూడో క్షమాపణలు

28 Sep, 2023 08:07 IST|Sakshi

ఒట్టావా: కెనడా పార్లమెంట్‌లో నాజీల తరుపున యుద్ధంలో పాల్గొన్న వ్యక్తిని ప్రశంసించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో క్షమాపణలు తెలిపారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకోకుండా సభలో సభ్యులు ప్రశంసలు కురిపించారని వెల్లడించిన ట్రూడో.. నాజీల దురాఘాతంలో నష్టపోయినవారికి ఇబ్బందికరమైన అంశంగా ఆయన పేర్కొన్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కెనడాలో పర్యటించారు.ఈ క్రమంలో హౌజ్‌ ఆఫ్ కామన్స్ సభలో ఆయన ప్రసంగించారు. ఇదే సమయంలో నాజీల తరుపున యుద్ధంలో పాల్గొన్న యారోస్లావ్ హుంకా(98)ను స్పీకర్ ఆంథోనీ రోటా ఆహ్వానించారు. సభలో సభ్యులందరూ హుంకాకు చప్పట్లతో ఆహ్వానం పలికి ప్రశంసించారు. స్పీకర్ రోటా.. హుంకాను హీరోగా అభివర్ణించారు. ఇది కాస్త వివాదంగా మారింది.

ఎందుకు వివాదం..?
యారోస్లావ్ హుంకా రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నాయకత్వంలో పనిచేసిన నాజీల ప్రత్యేక సైన్యంలో పోరాడారు. ఈ యుద్ధంలో యూదులను అంతం చేయడానికి హిట్లర్ భయంకరమైన హింసకు పాల్పడ్డాడు. అయితే.. ఈ యుద్ధ సమయంలో ఉక్రెయిన్ నాజీల ఆధీనంలో ఉండేది. స్వయంగా జెలెన్‌స్కీ కూడా తన యూదు బంధువులను ఎందరినో కోల్పోయారు. ఇలాంటి రాక్షస క్రీడ జరిపిన యుద్ధ పక్షాన నిలపడిన హుంకాను కామన్స్ సభలో సత్కరించడం వివాదంగా మారింది. యారోస్లావ్ హుంకా ఒకప్పుడు ఉక్రెయిన్ దేశస్థుడు. కెనడాకు వలస వచ్చి.. ఇక్కడే స్థిరపడ్డాడు.

ఈ వివాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడారు. క్షమాపణలు కోరినట్లు స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఒత్తిడితో హౌజ్‌ ఆఫ్ కామన్స్ స్పీకర్ ఆంథోనీ రోటా కూడా ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. అటు.. ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ దేశ అధ్యక్షుని పర్యటనలో ఇలాంటి ఘటనలు జరగడం దేశానికి అవమానంగా పేర్కొన్నారు. అయితే.. స్పీకర్ రోటా హుంకాను ఆహ్వానించే అంశాన్ని ప్రభుత్వంతో పంచుకోరని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

ఈ వివాదంపై రష్యా కూడా స్పందించింది. యుద్ధంలో ప్రేరేపించి ఉక్రెయిన్‌ను అంతం చేసే దిశగా పశ్చిమ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. కెనడాలో జరిగిన ఈ సంఘటన ఇందుకు ఉదాహారణగా పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: పన్నూపై కెనడా హిందూ సంఘాల ఆగ్రహం

మరిన్ని వార్తలు