ఉక్రెయిన్‌: యూరప్‌ అతిపెద్ద న్యూక్లియర్‌ ప్లాంట్‌పై రష్యా దాడి.. పేలిందంటే చెర్నోబిల్‌ కంటే పెనువిషాదం!

4 Mar, 2022 08:27 IST|Sakshi

రష్యా వైమానిక దాడుల్లో యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ జాపోరిజ్జియా అగ్నికీలల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం  ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా అధికారికంగా ప్రకటించారు.


ఉక్రెయిన్‌కు ఆగ్నేయం వైపు నైపర్‌ నదీ తీరాన ఉంది జాపోరిజ్జియా పారిశ్రామిక నగరం. ఇక్కడే యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్‌ ప్లాంట్‌ను నెలకొల్పారు. భారత కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటాక రష్యా దళాలు ఈ ప్లాంట్‌పై రాకెట్‌ లాంఛర్లతో దాడికి తెగబడ్డాయి. నలువైపులా దాడులు చేయడంతో.. ప్లాంట్‌ మంటల్లో చిక్కుకుంది. 


ఉక్రెయిన్‌కు దాదాపు 40 శాతం అణు విద్యుత్‌ ఈ స్టేషన్‌ నుంచే సరఫరా అవుతోంది. ఇప్పటికే చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఇప్పుడు ఉక్రెయిన్‌లోని అణు ప్లాంట్‌లను టార్గెట్‌ చేసింది. జాపోరిజ్జియా గనుక పేలిందంటే.. చెర్నోబిల్‌ విషాదం(1986లో జరిగిన పెను విషాదం) కంటే ఘోరంగా డ్యామేజ్‌ ఉంటుందని, రేడియేషన్‌ ఎఫెక్ట్‌ చెర్నోబిల్‌ కంటే పదిరెట్లు ఎక్కువ ప్రభావం చూపెడుతుందని కుబేలా ప్రకటించారు. రష్యన్లు వెంటనే దాడుల్ని ఆపివేయాలి, అగ్నిమాపక సిబ్బందిని అనుమతించాలి, ఆ ప్రాంతాన్ని సేఫ్‌ జోన్‌గా ఏర్పాటు చేయాల్సిందే అని ట్వీట్‌ చేశారు కుబేలా. 

మంటలను ఆర్పేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్న సమయంలోనూ రష్యా దాడులు కొనసాగినట్లు సమాచారం. అయితే జాపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ ప్రదేశంలో జరిగిన అగ్నిప్రమాదం.. కీలకమైన విభాగాల్ని ప్రభావితం చేయలేదని, ప్లాంట్ సిబ్బంది ఉపశమన చర్యలు తీసుకుంటున్నారని ఉక్రెయిన్‌ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీకి (IAEA) వెల్లడించింది. ఈ దాడులపై అమెరికా, ఉక్రెయిన్‌ను ఆరా తీసింది. మరోవైపు ఉక్రెయిన్‌ సహా పాశ్చాత్య దేశాలు న్యూక్లియర్‌ ప్లాంట్‌లపై దాడుల్ని చేయొద్దంటూ రష్యాను కోరుతున్నాయి.

మరిన్ని వార్తలు