పనిచేస్తోన్న కంపెనీలో రూ. 21 లక్షలు చోరీ.. డబ్బంతా ఏం చేశాడో తెలుసా?   

21 Jul, 2023 13:37 IST|Sakshi

లండన్: యూకేలో  వేల్స్ కు చెందిన ఒక నిర్మాణ కంపెనీలో పనిచేస్తోన్న థామస్ స్టైల్స్(25) అశ్లీల చిత్రాలకు బానిసై వాటిని కొనుగోలు చేసేందుకు తాను పనిచేస్తోన్న చోట అక్రమాలకు పాల్పడ్డాడు. కంపెనీ బిల్లల మొత్తాన్ని ఇష్టానికి మార్చుకుంటూ సుమారు రూ. 21 లక్షలు దోచుకున్నాడు. 

థామస్ స్టైల్స్(25) అట్లాంటిక్ క్లాడింగ్ అనే ఒక నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే తన ప్రతిభకు మెచ్చుకుంటూ మేనేజరుగా కూడా ప్రమోషన్ ఇచ్చింది కంపెనీ. ఆనతి కాలంలోనే వ్యాపార లావాదేవీల తాలూకు ఆర్ధిక చెల్లింపులు చేసే స్థాయికి ఎదిగాడు. మనిషి ఎదిగినప్పుడే బుద్ధి గడ్డి తింటుందన్నట్టు మంచి ఉద్యోగం ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకోకుండా తనకున్న వ్యసనానికి కంపెనీ డబ్బును పాడుచేశాడు. అశ్లీల వెబ్ సైట్ల మాయలో పడి తాను పనిచేస్తోన్న కంపెనీలో భారీ స్థాయిలో అవకతవకలకు పాల్పడ్డాడు. 

ఇష్టానుసారంగా బిల్లులు పెంచుకుంటూ పోయి తన పిచ్చిలో తాను మునిగి  తేలేవాడు. అంతలో పెరుగుతున్న బిల్లులను చూసి కంపెనీ వారికి అనుమానం రావడంతో తీగ లాగారు. డొంకంతా కదిలింది. మే 4 నుంచి జులై 31, 2021 వ్యవధిలో మొత్తం బిల్లుల అక్రమాలను లెక్క వేయగా సుమారు రూ. 21 లక్షలుగా తేలింది.  అంత మొత్తాన్ని ఏం చేశాడని ఆరా తీయగా విషయం తెలుసుకుని నివ్వెరపోయిన కంపెనీ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. 

కంపెనీ నమ్మకాన్ని వమ్ము చేసినందుకు న్యాయస్థానం థామస్ ను దోషిగా తేల్చి మొదట 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని భావించింది. కానీ జడ్జి దయ తలచి శిక్షను 10 నెలలకు కుదించారు. నెలకు 500 పౌండ్ల చొప్పున కంపెనీకి తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చారు.     

ఇది కూడా చదవండి: బెలారస్ లో వాగ్నర్‌ సైన్యం.. అంతా ప్లాన్ ప్రకారమే..?

మరిన్ని వార్తలు