20 లక్షల ఏళ్లుగా వాన పడలే.. ఎక్కడో తెలుసా!

10 Jan, 2022 04:22 IST|Sakshi

చుక్క వాన కోసం.. 20 లక్షల ఏళ్ల నుంచి..

భూమ్మీద వందలు, వేల ఏళ్లుగా వాన అనేదే లేకుండా, పూర్తిగా పొడిగా ఉండే ప్రదేశం ఎక్కడుందో తెలుసా? ఏముందీ.. ఏ సహారా ఎడారో, మరో ఎడారో అయి ఉంటుందిలే అనిపిస్తోందా? అస్సలు కాదు.. ఎటు చూసినా కిలోమీటర్ల ఎత్తున మంచుతో కప్పబడి ఉన్న అంటార్కిటికా ఖండంలో అలాంటి ‘కరువు’ ప్రాంతం ఉంది. చలితో గజగజ వణికిపోతున్న ఈ శీతాకాలంలో.. ఆ చలి ఖండంలోని చిత్రమైన ప్రాంతం విశేషాలు ఏమిటో తెలుసుకుందామా?      
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

మంచు మధ్య ‘కరువు’! 
భూమి దక్షిణ ధ్రువంలో కొన్ని కిలోమీటర్ల మందం మంచుతో కప్పబడి ఉన్న ఖండం అంటార్కిటికా. అత్యంత శీతలమైన ఈ ఖండంలో ఉత్తరం వైపు సముద్రతీరానికి సమీపంలో అత్యంత పొడిగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి. సుమారు 4,800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతాలను ‘డ్రై వ్యాలీస్‌’ అంటారు. ఇక్కడ సుమారు 20 లక్షల ఏళ్లుగా వాన పడటంగానీ, మంచు కురవడంగానీ జరగలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో చాలావరకు ఒక్క చుక్క నీళ్లుగానీ, మంచుగానీ లేకుండా అత్యంత పొడిగా ఉంటుంది. అంతేకాదు.. ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా మైనస్‌ 14 నుంచి మైనస్‌ 30 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మధ్య గడ్డ కట్టించే చలి ఉండటం గమనార్హం. 

మంచును కొండలు పట్టేసి.. 
నిజానికి అంటార్కిటికా ఖండంలోని గాలిలో తేమ శాతం ఎక్కువే. అలాంటి మంచు ఖండంలో ఇంతటి పొడి ప్రదేశాలు ఉండటానికి కారణం ‘కాటబాటిక్‌ విండ్స్‌’గా పిలిచే గాలులు కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ డ్రైవ్యాలీస్‌ ప్రాంతానికి చుట్టూ ‘ట్రాన్స్‌ అట్లాంటిక్‌’గా పిలిచే పర్వతాలు ఉన్నాయి. డ్రైవ్యాలీస్‌ వైపు వీచే గాలులు ఈ పర్వతాల కారణంగా వాతావరణంలో మరింత పైకి ఎగుస్తాయి. అక్కడి అతితక్కువ ఉష్ణోగ్రతల కారణంగా.. ఆ గాలుల్లోని తేమ అంతా మంచుగా మారి పర్వతాలపై పడిపోతుంది. ఏమాత్రం తేమలేని పొడి గాలులు.. డ్రైవ్యాలీస్‌ వైపు ప్రయాణిస్తాయి. వీటినే ‘కాటబాటిక్‌ విండ్స్‌’ అంటారు. గాలిలో తేమ లేకపోవడంతో వానలు, మంచు కురవడం వంటివి అసలే ఉండవు. 

ఉప్పునీటి సరస్సులతో.. 
డ్రైవ్యాలీస్‌గా పిలిచే ప్రాంతంలో కొన్ని సరస్సులు కూడా ఉన్నాయి. ఎప్పుడో లక్షల ఏళ్ల కింద ఏర్పడ్డ ఆ సరస్సుల్లో అప్పటి నీరే ఉంది. వానలు, హిమపాతం లేకపోవడంతో కొత్తగా నీళ్లు చేరే అవకాశం లేదు. వేల ఏళ్లుగా వేసవికాలంలో స్వల్పంగా నీరు ఆవిరవుతూ వస్తుండటంతో ఈ సరస్సుల్లోని నీటిలో లవణాలు ఎక్కువ. ఆ నీళ్లు సముద్రపు నీటికన్నా మూడు రెట్లు ఉప్పుగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తిగా మంచినీటి మంచు ఖండంలో ఇలా ఉప్పునీటి సరస్సులు ఉండటం మరో వింత కూడా. 

అక్కడక్కడా ‘మమ్మీ’లు కూడా.. 
సమీపంలోని సముద్రం నుంచో, మధ్యలోని సరస్సుల నుంచో డ్రైవ్యాలీస్‌లోకి వచ్చిన సీల్‌ జంతువులు.. అక్కడి పరిస్థితులను తట్టుకోలేక చనిపోతాయి. ఇలా చనిపోయిన వాటి శరీరాలు వందలు, వేల ఏళ్లపాటు పెద్దగా చెడిపోకుండా ‘మమ్మీ’ల్లా ఉండిపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. చుక్కనీరు లేని పరిస్థితులు, తీవ్రమైన చలి, ఉప్పునీరు వంటివి దీనికి కారణమని తేల్చారు. 

రెండోస్థానంలో అటకామా ఎడారి 
అంటార్కిటికాలోని డ్రైవ్యాలీస్‌ను మినహాయిస్తే.. భూమ్మీద అత్యంత పొడిగా ఉండే ప్రాంతం అటకామా ఎడారి. చిలీ, పెరూ దేశాల మధ్య ఉన్న ఈ ఎడారిలో ఏళ్లకేళ్లు ఒక్క చుక్క వాన కూడా పడదు. ఒకవేళ పడినా ఏడాదికి ఒకట్రెండు మిల్లీమీటర్ల కంటే తక్కువే పడుతుంది. మన దగ్గర ఒకట్రెండు నిమిషాల పాటు కురిసే వానకంటే అది తక్కువ. 

మరిన్ని వార్తలు