ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా టీకాలు.. కీలక విషయాలు వెల్లడి

28 Apr, 2021 12:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ గురించి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా పాజిటివ్‌ బాధితులు ఒక్క డోస్‌ ఫైజర్‌ లేదా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ వేయించుకుంటే వారినుంచి ఇతర కుటుంబ సభ్యులకు వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని తేలింది. దాదాపు 50 శాతం వరకు ఈ రెండు వ్యాక్సిన్లు వైరస్‌ వ్యాప్తిని నిరోధిస్తాయని ది పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ రీసెర్చ్‌ (పీహెచ్‌ఈ) అనే జర్నల్‌ తన కథనంలో పేర్కొంది.

ది పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ రీసెర్చ్‌ (పీహెచ్‌ఈ) కథనం ప్రకారం.. ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా టీకాల్లో ఏదైనా ఒక్కడోస్‌ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నవారు మూడు వారాల తర్వాత కోవిడ్‌ బారినపడితే.. ఈ రెండు వ్యాక్సిన్లు వేసుకున్న కారణంగా వారి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాప్తి 38 నుంచి 49 శాతం మేర తక్కువగా ఉన్నట్లు పీహెచ్‌ఈ రీసెర్చ్‌ సైంటిస్ట్‌లు వెల్లడించారు. 

‘ఇది అద్భుతం. ఇప్పటికే మేం చేసిన పరిశోధనల్లో వ్యాక్సిన్‌ ప్రాణాల్ని కాపాడుతుందని గుర్తించాం. తాజా పరిశోధనల్లో ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని మరోసారి నిరూపితమైంది’ అని బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ అన్నారు.  

వ్యాక్సిన్‌ వేయించుకున్న 57 వేల మందికి చెందిన 24 వేల కుటుంబాల ఆరోగ్య స్థితిగతులు, సంబంధిత డేటా ఆధారంగా తాము చేసిన పరిశోధనల్లో ఈ ఫలితాలు వెలుగులోకి వచ్చాయని మాట్‌ హాన్కాక్‌ చెప్పారు. అంతేకాదు ఒక్కడోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నవారు నాలుగు వారాల తర్వాత వైరస్‌బారిన పడితే  65 శాతం వరకు వైరస్‌ వ్యాప్తి చెందడం తగ్గుతుందని గతంలో తేలిందన్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు