Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు.. తొలిసారి స్పందించిన పాకిస్తాన్‌ మాజీ ప్రధాని

4 Nov, 2022 11:41 IST|Sakshi

లాహోర్‌: పాకిస్తాన్‌ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ గురువారం పార్టీ ర్యాలీలో తనపై జరిగిన హత్యాయత్నం అనంతరం పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తొలిసారి స్పందించారు. తనకు దేవుడు మరో జీవితాన్ని(పునర్జన్మ) ఇచ్చాడని వ్యాఖ్యానించారు. అల్లా మరో అవకాశం ఇచ్చారని, తన పోరాటాన్ని తిరిగి కొనసాగిస్తానని పేర్కొన్నారు. అంతేగాక తనపై జరిగిన దాడికి ఎవరినీ నిందించడం లేదని అన్నారు.

కాగా ఇమ్రాన్‌ ఖాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో కంటైనర్‌ ట్రక్కుపై నిల్చొని మాట్లాడుతుండగా గుర్తు తెలియని యువకుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇమ్రాన్‌ రెండు కాళ్లకు బుల్లెట్‌ తగిలి గాయం కాగా.. పీటీఐ పార్టీకి చెందిన పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వీరిని లాహోర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
చదవండి: సుదీర్ఘకాలంగా కరోనాతో పోరాటం.. 411 రోజుల తర్వాత విముక్తి

ఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకే ఇమ్రాన్‌ ఖాన్‌ను చంపేందుకు వచ్చానని నిందితుడు తెలిపాడు. ఇమ్రాన్‌ను మాత్రమే చంపాలని ప్రయత్నించానని.. ఇంకెవరిని కాదని అన్నాడు. తాను ఏ పార్టీకి, ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడిని కాదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా ఇమ్రాన్‌ ఖాన్‌ కుడి కాలుకి గాయంతో పట్టి వేసుకొని ఆసుపత్రి బెడ్‌పై పడుకొని ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో అతను కళ్లు తెరిచి ఎవరితోనే చిన్నగా మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. 
చదవండి: Imran Khan Rally: ఇమ్రాన్‌ ఖాన్‌ ర్యాలీలో ఫైరింగ్‌.. నలుగురికి గాయాలు

మరిన్ని వార్తలు