మోదీతో కలిసి పనిచేస్తాం : బైడెన్‌

19 Nov, 2020 04:26 IST|Sakshi
మోదీతో బైడెన్‌ (ఫైల్‌)

యూఎస్‌ ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ బైడెన్‌

వాషింగ్టన్‌: కోవిడ్‌ లాంటి అంతర్జాతీయ సవాళ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జోబైడెన్‌ చెప్పారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతిభద్రతల నిర్వహణ, ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను రికవరీ బాట పట్టించడం లాంటి అంశాలపై మోదీతో కలిసి పనిచేయాలని చూస్తున్నట్లు బైడెన్‌ తెలిపారు. తనకు అభినందనలు తెలిపినందుకు మోదీకి బైడెన్‌ కృతజ్ఞతలు చెప్పారు.

కమలా హ్యారిస్‌తో కలిసి ఇండోఅమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. బైడెన్‌కు మోదీ మంగళవారం అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే! కమలా హ్యారిస్‌ను సైతం మోదీ అభినందించారు. బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో జరిపిన సమావేశాలను మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 1970 నుంచి సెనేటర్‌గా బైడెన్‌ భారత్‌కు బలమైన మద్దతునిస్తున్నారు. 2008లో ద్వైపాక్షిక అణుఒప్పంద ఆమోదం కోసం బైడెన్‌ గట్టిగా కృషి చేశారు. ఒబామా హయంలో ఇండో అమెరికా బంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు బైడెన్‌ ఎంతో చొరవ తీసుకున్నారు.  

బైడెన్, కమలకు సెక్యూరిటీ బ్రీఫింగ్‌
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్‌కు జాతీయ భద్రతా నిపుణులు దేశ ప్రస్తుత పరిస్థితులను వివరించారు. దౌత్య, రక్షణ, నిఘా వంటి కీలక అంశాల్లో అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేశారు. కాబోయే అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ఇలాంటి సమాచారం తెలియజేయడం ఒక సంప్రదాయం. అమెరికాలో అధికార మార్పిడి ప్రక్రియను పూర్తిచేయాల్సిన బాధ్యత జనరల్‌ సర్వీస్‌ అడ్మినిస్ట్రేషన్‌దే (జీఎస్‌ఏ). ఈ విభాగం అధిపతిగా ఎమిలీ డబ్ల్యూ మర్ఫీని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ నియమించారు. బైడెన్, కమలా హ్యారిస్‌ ఎన్నికను మర్ఫీ అధికారికంగా గుర్తించలేదు. అధికార మార్పిడి ప్రక్రియను ప్రారంభించేందుకు మర్ఫీ నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ బ్రీఫింగ్‌ను జాతీయ భద్రతా నిపుణులు ముగించారు.

బైడెన్‌ కేబినెట్‌లో ఇండియన్స్‌ వీళ్లే!
అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ ప్రమాణ స్వీకారం చేసినట్లయితే ఆయన కేబినెట్‌లో ప్రముఖ ఇండో అమెరికన్లు వివేక్‌ మూర్తి, అరుణ్‌ మజుందార్‌కు చోటు దక్కవచ్చని మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం బైడెన్‌కు కోవిడ్‌–19పై సలహాదారుగా ఉన్న మూర్తిని సెక్రటరీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌గా, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అరుణ్‌ను సెక్రటరీ ఆఫ్‌ ఎనర్జీగా నియమించవచ్చని వాషింగ్టన్‌ పోస్ట్, పొలిటికో పత్రికలు కథనాలు వెలువరిస్తున్నాయి. వీరిద్దరూ చాలా కాలంగా బైడెన్‌కు సన్నిహిత సలహాదారులుగా ఉంటున్నారు. అయితే ఈ పదవులకు వీరితో పాటు మరికొందరు రేసులో ఉన్నారని సంబంధిత వర్గాల అంచనా. 2014లో మూర్తి యూఎస్‌ సర్జన్‌ జనరల్‌ అయ్యారు. పదవీ కాలంలో ఆయన మాదకద్రవ్యాలు, ఆల్కహాల్‌ వ్యసనం లాంటి పలు సామాజికాంశాలపై పనిచేశారు. మజుందార్‌ ఒబామా హయంలో పనిచేశారు.
 

మరిన్ని వార్తలు