పరేషాన్‌లో ఇమ్రాన్‌! పూర్తిగా గాలి తీసేసిన మాజీ భార్య రెహమ్‌ ఖాన్‌

1 Apr, 2022 15:03 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. పాక్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేప‌థ్యంలో.. ఆయన మాజీ భార్య రెహ‌మ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో తాజా పరిస్థితులపై ఆమె ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ఇమ్రాన్ ఇప్పుడో గ‌త చ‌రిత్ర అని, న‌యా పాకిస్థాన్ పేరుతో పేర్చిన చెత్త‌ను శుభ్రం చేయాల‌ని, దీని కోసం అంద‌రూ క‌లిసి ప‌నిచేయాల‌ని ఆమె అన్నారు. ఇమ్రాన్‌కు సామ‌ర్థ్యం, తెలివి లేద‌ని రెహ‌మ్ విమ‌ర్శించారు. ఇమ్రాన్ చేసిన ప్ర‌సంగాన్ని రెహ‌మ్ తీవ్రంగా విమ‌ర్శిస్తూ.. మీరు ప్ర‌ధాని కాన‌ప్పుడే పాక్ ఉన్న‌తంగా ఉంద‌ని కామెంట్స్‌ చేశారు.

ఇమ్రాన్‌కు మూడు పెళ్లిళ్లు..
ఇమ్రాన్‌కు రెహమ్‌ ఖాన్‌.. రెండో భార్య. కాగా, 1995లో బ్రిటన్‌ బిలియనీర్‌ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహమాడిన ఇమ్రాన్‌.. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. 2015 జనవరిలో బీబీసీ జర్నలిస్ట్‌ రెహమ్‌ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నా ఇమ్రాన్‌.. ఆమెతో అక్టోబర్‌లో విడిపోయింది. తొమ్మిది నెలలకే వీరి వివాహ బంధం తెగిపోయింది. ఇక మూడోదిగా మతగురువైన బుష్రా మనేకాను ఇమ్రాన్‌ 2018 ఫిబ్రవరిలో పెళ్లాడారు. సరిగ్గా మూడు నెలలు కూడా తిరక్కముందే బుష్రా.. ఇమ్రాన్‌తో విడిపోయారు.

మరోవైపు.. అవిశ్వాస తీర్మానం నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ గట్టెక్కడం కష్టతరంగా మారినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 స‌భ్యుల ఓట్లు అవ‌స‌రం ఉండగా.. ప్రస్తుతం ఇమ్రాన్‌ ప్రభుత్వానికి 163 మంది సభ్యుల బలముంది. ఇమ్రాన్‌ గద్దె దిగడం ఖాయమన్న వార్తల నేపథ్యంలోనే ఆయన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే  జాతీయ అసెంబ్లీని రద్దు చేసే ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి ఎలాగైనా దింపేందకు అవసరమైన బలాన్ని విపక్షాలు కూడగడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇమ్రాన్‌ ఖాన్‌ దిగిపోతే ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్‌-ఎన్‌ చీఫ్‌ షహబాజ్‌ షరీఫ్‌.. పాక్‌ తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు ఆ దేశ రాజకీయ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని వార్తలు