92 ఏళ్ల వయసులో నాలుగో భార్యకు విడాకులు.. ఇక చాలు అంటూ.. 11 పదాల సందేశంతో కటీఫ్‌ చెప్పిన కోటీశ్వరుడు

14 Apr, 2023 09:47 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా బిలియనీర్, మీడియా మొగల్‌గా ప్రఖ్యాతి గాంచిన రుపర్ట్‌ ముర్డోచ్‌ 92 ఏళ్ల వయసులో తన నాలుగో భార్య జెర్రీ హాల్‌(65)కు విడాకులు ఇచ్చారు. కేవలం  11 పదాల సందేశాన్ని ఈమెయిల్ చేసి ఆమెకు కటీఫ్ చెప్పారు. ఈ సమయంలో ఆమె ఇంట్లోనే ముర్డోచ్ కోసం ఎదురు చూస్తుండటం గమనార్హం.

'మనమిద్దరం కచ్చితంగా మంచి సయమం గడిపాం. కానీ నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది. నా న్యూయార్క్ లాయర్ తక్షణమే వచ్చి నిన్ను కలుస్తారు' అని జెర్రీకి ముర్డోచ్‌ విడాకుల సందేశం పంపారు. ఈ జంట దాదాపు 6 ఏళ్లు కలిసి ఉంది. ఇది ముర్డోచ్‌కు నాలుగో వివాహం కాగా.. జెర్రీకి మాత్రం మొదటిది.  అయితే ఆమె అంతకుముందు రాక్‌స్టార్‌ మిగ్ జాగర్‌తో కొంతకాలం పాటు రిలేషన్‌లో ఉన్నారు.

గతేడాది జూన్‌లో వీరి విడాకులు ఎలా జరిగాయనే విషయాన్ని జెర్రీ స్నేహితులు తాజాగా వెల్లడించారు. ముర్డోచ్ సందేశం చూసి జెర్రీ హాల్ మైండ్ బ్లాంక్ అయిందని వాపోయారు. ఆమెకు ఏం చేయాలో తెలియలేదని పేర్కొన్నారు. అంతేకాదు విడాకుల విషయం చెప్పిన అనంతరం కాలిఫోర్నియాలోని తన మ్యాన్షన్‌ హౌస్ విడిచి పెళ్లిపోవాలని జేర్రీకి ముర్డోచ్‌ 30 రోజులే గడువు ఇచ్చాడని తెలిపారు.

ముర్డోచ్‌ 14.5 బిలియన్ డాలర్లకు అధిపతి. ఆయనకు మొత్తం ఆరుగురు సంతానం. వీరిలో ఒక్కరు కూడా జెర్రీ సంతానం కాదు. దీంతో అతని ఆస్తిలో ఆమెకు వాటా వచ్చే అవకాశం లేదు. 2016లో సెంట్రల్ లండన్‌లో ముర్డోచ్, జెర్రీల వివాహం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ.. ఈ ప్రపంచంలో తాను అత్యంత అదృష్టవంతుడినని, సంతోషమైన వ్యక్తిని అని ముర్డోచ్ రాసుకొచ్చారు. ఇక ట్విట్టర్లో ఎలాంటి పోస్టులు పెట్టొబోనని కూడా ఈ సందర్భంగాప్రకటించారు.

మరో పెళ్లి అని ప్రకటించి..
అయితే జేర్రీకి విడాకులిచ్చి ఏడాది కూడా గడవక ముందే తాను ఐదో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత నెలలోనే ప్రకటించారు ముర్డోచ్. అన లెస్లే స్మిత్‌ను మనువాడుతానని చెప్పాడు. ఈమె ఏడు నెలలక్రితమే పరిచయమైనట్లు తెలుస్తోంది. అయితే  ప్రస్తుతం వీరు పెళ్లి ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం. దీంతో ఐదో పెళ్లి అనుకోకుండా రద్దయింది.

ది సన్, ది టైమ్స్ వంటి న్యూస్‌పేపర్లు, ఫాక్స్ న్యూస్, ది వాల్ స్ట్రీట్ జర్నల్‌ వంటి మీడియా సంస్థలకు ముర్డోచ్ యజమాని. ఆస్ట్రేలియాలో జన్మించిన ఈయన అమెరికాలో స్థిరపడ్డారు. మీడియా మొగల్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందారు.
చదవండి: ఇదేందిరా అయ్యా.. పెళ్లి వేడుకలో వధువుకు చేదు అనుభవం

మరిన్ని వార్తలు