1.5 లీటర్ల వోడ్కా ఛాలెంజ్‌.. చివరికి

6 Feb, 2021 10:52 IST|Sakshi

మాస్కో : వోడ్కా ఛాలెంజ్‌ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. రష్యాకు చెందిన 60 ఏళ్ల యూరి దుషెచ్కిన్‌ అనే వ్యక్తి ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి వోడ్కాను తాగడం ప్రారంభించాడు. అయితే 1.5లీటర్ల వోడ్కా తాగిన తర్వాత ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. యూట్యూబ్‌ లైవ్‌లో అందరూ చూస్తుండగానే ఇతను కన్నుమూశాడు. దీంతో ఈ సరదా ఛాలెంజ్‌ విషాదంగా ముగిసింది. వివరాల ప్రకారం.. లైవ్‌లో హాట్‌ సాస్‌ లేదా, వోడ్కాను తాగాల్సిందిగా ఓ యూట్యూబర్‌ సవాల్‌ విసిరాడు. ఈ ఛాలెంజ్‌ పూర్తిచేసిన వారికి రివార్డ్‌గా పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తాయని ప్రకటించాడు. దీంతో ఈ పోటీలో పాల్గొనేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. ప్రత్యేకంగా ఏజ్‌ లిమిట్‌ ఏదీ విధించకపోవడంతో 60 ఏళ్ల వృద్ధుడు సైతం ఈ పోటీలో పాల్గొన్నాడు. (వైరల్‌: గుడిసెకు కాళ్లు వచ్చాయా?)

లైవ్‌ స్ట్రీమింగ్‌లో అప్పటిదాకా ఎంతో హుషారుగా కనిపించిన ఆయన వోడ్కా సేవిస్తూ చనిపోవడం నెటిజన్లను షాక్‌కి గురిచేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. రష్యన్‌ సెనేటర్‌ అలెక్సీ పుష్కోవ్ సైతం ఇలాంటి ప్రాణాంతకమైన ఛాలెంజ్‌లపై నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో కొత్తగా ఎన్నోరకాల ఛాలెంజ్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. సరదా సంగతి అటుంచితే, కొన్ని ప్రాణాల మీదకి తెస్తున్నాయి. దీంతో ఇలాంటి ఛాలెంజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. (53 ఏళ్లకు దొరికిన పర్స్‌, ఏదీ మిస్‌ అవ్వలేదు!)

మరిన్ని వార్తలు