రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్‌ రాజధానిలో నీటి సరాఫరా బంద్‌

16 Dec, 2022 15:12 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. రష్యా యుద్ధంతో ఉక్రెయిన్‌ పూర్తిగా ధ్వంసమవుతోంది. శత్రువు దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌ సేనికులు తీవ్రంగా పోరాడుతున్నారు. ఉక్రెయిన్‌ దేశ రాజధాని కీవ్‌పై రష్యా బలగాలు మరోసారి దృష్టి సారించాయి. రాజధాని ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కీవ్‌ను లక్ష్యంగా చేసుకొని రష్యా భీకర దాడులు చేపట్టింది. శుక్రవారం తెల్లవారుజామున కీవ్‌ బాంబుల మోతతో దద్దరిల్లింది.

రష్యా చర్యతో మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వల్ల కీవ్‌లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని కీవ్‌ మేయర్‌ విటాలీ క్విచ్కో వెల్లడించారు. మెట్రో సర్వీస్‌లు నిలిపివేయడంతో స్టేషన్లను షెల్టర్స్‌గా వినియోగించుకోవాలని తెలిపారు. కీవ్‌లోని సెంట్రల్‌ జిల్లాలు, డెస్న్యాన్‌ జిల్లాలో పేలుళ్ల మోత వినిపించిందని, స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని పేర్కొన్నారు.

కాగా రష్యా వరుస దాడుల దాడులతో ఉక్రెయిన్‌ విద్యుత్‌ నెట్‌వర్క్‌ ఇప్పటికే తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్‌ అంతరాయం కారణంగా లక్షలాది ఉక్రెనియన్లు అంధకారంలో చిక్కుకుపోయారు. ఉక్రెయిన్ విద్యుత్, ఇంధన, మౌలిక సదుపాయాల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఈ దాడులు చేపట్టింది.
చదవండి: కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు

మరిన్ని వార్తలు