Saudi Princess: మూడేళ్ల తర్వాత సౌదీ యువరాణి విడుదల 

10 Jan, 2022 21:04 IST|Sakshi

దుబాయ్‌: అనుమానాస్పద పరిస్థితుల్లో మూడేళ్ల క్రితం జైలు పాలైన యువరాణిని సౌదీ అధికారులు విడుదల చేసినట్లు ఆమె అనునూయులు తెలిపారు. సౌదీ రెండో రాజు కూతురు బస్మా బిన్‌ సౌద్‌ 2019 మార్చిలో అదృశ్యమయ్యారు. అనంతరం ఆమె ఎలాంటి నేరారోపణలు లేకుండా కఠోరమైన సౌదీ జైల్లో కనిపించారు. ఆమెతో పాటు ఆమె కూతురుని కూడా అప్పట్లో నిర్భంధించారు. ఇందుకు సరైన కారణాలు తెలియరాలేదు. అయితే సింహాసనంపై పట్టు సాధించే క్రమంలో యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ కఠినంగా వ్యవహరిస్తూవస్తున్న సందర్భంలో పలువురు రాజకుటుంబీకులు ఇబ్బందుల పాలయ్యారు.

ఈ క్రమంలోనే బస్మా కూడా బందీగా మారి ఉండొచ్చని కొందరి అంచనా. ఆమె అక్రమంగా రాజ్యం విడిచి పారిపోవడానికి యత్నించినట్లు 2020లో సౌదీ మిషన్‌ టు యూఎన్‌ తెలిపింది. అయితే తాజాగా 58 ఏళ్ల బస్మాతో పాటు ఆమె 30ఏళ్ల కుమార్తె సుహౌద్‌ అల్‌ షరీఫ్‌ను రియాద్‌లోని అల్‌హైర్‌ జైలు నుంచి గతవారం విడుదల చేశారని, ఆమె జిద్దాలోని స్వగృహానికి చేరారాని బస్మా న్యాయ ప్రతినిధి హెన్రి ఎస్ట్రామెంట్‌ తెలిపారు.
చదవండి: నాడు కలిచివేసిన ఫొటో.. నేడు ‘కన్నీటి’ సుఖాంతం

బస్మా ఆస్టియోపోరోసిస్‌ సహా పలు అనారోగ్యాలతో బాధపడుతున్నారని, ఇకపై తగు చికిత్సలకు హాజరవుతారని వెల్లడించారు. చికిత్స కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్లే యత్నాల్లో ఉన్న బస్మాను సెక్యూరిటీ ఏజెంట్లు అన్యాయంగా నిర్భంధించారన్నారు. జైల్లో ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదన్నారు. ఆమె విడుదల కోసం ఐరాసకు దరఖాస్తు చేశామన్నారు. నెలలపాటు ఆమె ఆచూకీ తెలియరాలేదని, చివరకు ఆమె విడుదల కావడం సంతోషమని చెప్పారు.  
చదవండి: చంద్రుడిపై నీటి జాడలు.. ఇదే తొలిసారి!

మరిన్ని వార్తలు