ముంచుకొస్తున్న మరో ముప్పు, ఈ నల్లని మేఘాలు మరింత ప్రమాదకరం ఎందుకంటే?

1 May, 2023 21:44 IST|Sakshi
చూడటానికి పక్షిలా కనిపిస్తున్న ఈ మేఘం నిజానికి పూర్తిగా బ్యాక్టీరియాతో నిండి ఉంది. ఇలాంటి బ్యాక్టీరియా యాంటీ బయాటిక్‌లకు కూడా లొంగదట

ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకుంటే? మామూలుగా అయితే వాన రాకడకు సూచిక. కానీ, జీవజలాన్ని కాక ప్రమాదకరమైన బ్యాక్టీరియాను మోసుకొచ్చే మేఘాలున్నాయని తెలుసా? నిజం. ఇలాంటి మేఘాలున్నాయని కెనడా, ఫ్రాన్స్‌ పరిశోధకులు చెబుతున్నారు. ఔషధాల శక్తిని తట్టుకొని మరీ నిక్షేపంగా జీవించే బ్యాక్టీరియా ఈ మేఘాల్లో నిండి ఉంటుందని, వాటితో పాటే అది సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తుందని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచమంతటినీ చుట్టేస్తుందన్నమాట! ఈ అధ్యయనం వివరాలను సైన్స్‌ ఆఫ్‌ ద టోటల్‌ ఎన్విరాన్‌మెంట్‌ పత్రికలో ప్రచురించారు.

► కెనడాలో క్విబెక్‌ సిటీలోని లావల్‌ యూనివర్సిటీ, సెంట్రల్‌ ఫ్రాన్స్‌లోని క్లెర్మాంట్‌ అవెర్జిన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మేఘాల నమూనాలను సేకరించి పరీక్షించారు.
► 8,000 ఒక మిల్లీలీటర్‌ మేఘంలో సగటున ఉన్న బ్యాక్టీరియా సంఖ్య.
► మేఘాల్లోని ఈ బ్యాక్టీరియాలో 29 ఉపవర్గాలకు చెందిన యాంటీబయాటిక్‌ను తట్టుకునే జన్యువులు ఉన్నట్టు గుర్తించారు.
► ఈ మేఘాల్లో యాంటీబయాటిక్స్‌ను తట్టుకొనే జన్యువులతో కూడిన బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు.
► 2019 సెప్టెంబర్‌ నుంచి 2021 అక్టోబర్‌ దాకా ఈ పరిశోధన నిర్వహించారు.
► చెట్లపై, భూమిలో ఉన్న బ్యాక్టీరియా గట్టి గాలుల ద్వారా వాతావరణంలోకి, అటునుంచి మేఘాల్లోకి చేరుతుంది. వాటితో పాటు సుదూరాలకు పయనిస్తుంది.
► సముద్ర మట్టానికి 1,465 మీటర్ల(4,806 అడుగులు) ఎత్తులో ఉన్న మేఘాల నుంచి నమూనాలను సేకరించారు.
► మిల్లీలీటర్‌ పరిమాణంలో 330 నుంచి ఏకంగా 30,000కు పైగా బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది.
► వర్షంగా కురిసిన చోట మేఘాల నుంచి భూమిపైకి చేరుతుంది.
► మేఘాల ద్వారా ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందే బ్యాక్టీరియాతో మానవళి ఆరోగ్యానికి ఉన్న ముప్పుపై పూర్తిస్థాయి
పరిశోధనలు జరగాల్సి ఉంది.
► ఈ బ్యాక్టీరియాలో 5 నుంచి 50 శాతం దాకా మాత్రమే క్రియాశీలకంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. మేఘాల బ్యాక్టీరియా వల్ల మనుషులకు ముప్పు స్వల్పమేనని పరిశోధకురాలు ఫ్లోరెంట్‌ రోసీ అభిప్రాయపడ్డారు. ‘వర్షంలో బయట నడవాలంటే భయపడాల్సిన అవసరం లేదన్నమాట’ అంటూ చమత్కరించారు!
► మేఘాల్లోని బ్యాక్టీరియా జన్యువులు ఇతర బ్యాక్టీరియాతో కలుస్తాయా, లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని రోసీ వెల్లడించారు.
► డ్రగ్‌–రెసిస్టెంట్‌ను కలిగిన బ్యాక్టీరియాల మూలాలను కనుగొనేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు