Afghanistan: మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.. కంటతడి పెట్టిస్తున్న యువతి వీడియో

17 Aug, 2021 16:43 IST|Sakshi

కాబూల్‌: అప్గనిస్తాన్‌లో రెండు దశాబ్దాల తరువాత పూర్వవైభవం పొందిన తాలిబన్లు పూర్తిగా ఆధిపత్యం సాధించారు. ఇక అధికార పగ్గాలు చేపట్టేందుకు తాలిబన్ల సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే అఫ్గనిస్తాన్‌ మళ్లీ తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో అక్కడి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు వారి చేతుల్లో అనుభవించబోయే ప్రత్యక్ష నరకాన్నితలుచుకుని తల్లడిల్లుతున్నారు. తాలిబాన్లు అధికారంలోకి రావడంతో తమ జీవితం మళ్లీ అంధకారంలోకే వెళుతుందని మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

చదవండి: అఫ్గన్‌ల దుస్థితికి అద్దం పడుతున్న దృశ్యాలు!

ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ నుంచి హృదయవిదారక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ ప్రాణాలకు రక్షణ లేదంటూ యువతులు, మహిళలు విలపిస్తున్నారు. తాజాగా అప్గన్‌కు చెందిన ఓ వీడియో వైరల్‌గా మారింది. తాము అప్గనిస్తాన్‌లో జన్మించడం వల్ల ఎవరూ తమను లెక్కచేయరంటూ ఓ యువతి కన్నీళ్లు పెట్టుకుంది. ‘మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. చరిత్రలో మేము నెమ్మదిగా కనుమరుగవుతాము. ఇది తమాషా కాదు. మా పరిస్థితిని ఎవరూ పట్టించుకోరు. కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నాను’ అంటూ కన్నీరుమున్నీరైంది. 

చదవండి: అఫ్గన్‌ అరాచకాల వైరల్‌.. కట్టడికి ప్రయత్నాలు షురూ!

ఈ వీడియోను ఇరానియన్‌ జర్నలిస్ట్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘దేశాన్ని తాలిబాన్లు ఆక్రమించడంతో భవిష్యత్తు అస్తవ్యస్తమైన అప్గన్‌ అమ్మాయి కన్నీళ్లు. అప్గనిస్తాన్ మహిళలను చూస్తుంటే నా గుండె పగిలిపోతుంది.’ అని కామెంట్‌తో పోస్టు చేశారు. కాగా ఈ వీడియో అప్గన్ మహిళల పరిస్థితులకు అద్దం పడుతోంది. దీనిని చూసినవారు అక్కడి ప్రజల బాధ వర్ణనాతీతమని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా తాలిబన్ల రాక్షసపాలనకు భయపడి అక్కడ ఉండలేక దేశాన్ని విడిచిపోయేందుకు జనాలు పరుగులు తీస్తున్నారు. తండోపతండాలుగా విమానాశ్రాయాలు, రోడ్ల మీదకు చేరుకుంటున్న అప్గన్‌ ప్రజల దీన దృశ్యాలు ప్రపంచాన్ని కంటతడిపెట్టిస్తున్నాయి.

చదవండి: నరకయాతన: విమానం నుంచి కిందపడిన ఇద్దరు అఫ్గన్‌లు

మరిన్ని వార్తలు