అప్గన్‌ పార్లమెంట్‌ భవనం తాలిబన్లు స్వాధీనం

16 Aug, 2021 21:05 IST|Sakshi

కాబూల్‌:  అఫ్ఘనిస్తాన్‌ మళ్లీ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాలిబన్ల రాక్షస రాజ్యంలో ఎన్ని చిత్రహింసలు అనుభవించాలో తలుచుకుని వణికిపోతున్నారు. కాగా తాలిబన్లు ఆదివారం అఫ్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ను ఆక్రమించిన సంగతి తెలిసిందే. ఇక పూర్తి అధికారాన్ని దక్కించుకొనే దిశగా అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో అప్గనిస్తాన్‌ అధ్యక్ష భవనాన్ని తాలిబన్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కాబూల్‌లోని పార్లమెంటు భవనంలోకి ప్రవేశించి సంబరాలు చేసుకున్నాయి. పార్లమెంట్‌ లోపల తాలిబన్లు ఆయుధాలు ధరించి ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

స్పీకర్‌ చైర్‌లో ఒక తాలిబన్‌ కూర్చొని టేబుల్‌పై తుపాకీని ఉంచగా.. అధ్యక్షుడితోపాటు ఇతర ప్రముఖులు కూర్చునే స్థానాల్లో మరి కొందరు సాయుధ తాలిబన్లు కూర్చున్నారు. సరిగ్గా రెండు వారాల క్రితం అప్గన్‌ అధ్యక్షుడు అర్షఫ్ ఘనీ సంయుక్త సమావేశాన్ని నిర్వహించినప్పుడు నాయకులు కూర్చున్న కుర్చీలపైనే తాలిబన్లు కూర్చున్నారు. పార్లమెంట్‌ లోపల ఉన్న అప్గనిస్తాన్‌ జాతీయ జెండాను తొలగించారు. అఫ్గానిస్తాన్‌ పేరును మార్చాలని తాలిబన్లు నిర్ణయించారు. ఇకపై ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌గా పిలవాలని ఆదేశించారు. అధ్యక్ష భవన నుంచే ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. అమెరికా సైన్యం రాకముందు తాలిబన్ల పాలన కొనసాగుతున్నప్పుడు అఫ్గాన్‌కు ఇదే పేరు ఉండేది.  

మరిన్ని వార్తలు