వినూత్న డిజైన్‌తో పబ్లిక్‌ టాయిలెట్లు

20 Aug, 2020 19:38 IST|Sakshi

టోక్యోలో స్మార్ట్‌ టాయిలెట్లు

టోక్యో : పబ్లిక్‌ టాయిలెట్లు అనగానే అపరిశుభ్రత, దుర్వాసనలతో జనం వాటికి దూరంగా జరిగే పరిస్ధితి నెలకొంటే టోక్యోలో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ వాటిని అద్భుత డిజైన్‌తో ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. పారదర్శక వాల్స్‌తో భిన్నమైన రంగుల్లో టాయిలెట్లను డిజైన్‌ చేశారు. బయటనుంచి పారదర్శకంగా కనిపించే మూత్రశాలలు, ఉపయోగించే సమయంలో డార్క్‌గా మారేలా ఏర్పాటు చేయడం ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్‌ టాయిలెట్లు అంటే ముక్కు మూసుకునేలా ఉన్నా జపాన్‌లో​ రెస్ట్‌రూమ్స్‌ అత్యంత మెరుగైన పారిశుద్ధ్య ప్రమాణాలకు నిలువుటద్దంలా ఉంటాయి. పారిశుద్ధ్య పరిస్ధితి మెరుగ్గా ఉండే జపాన్‌లోనూ పబ్లిక్‌ టాయిలెట్లపై నెలకొన్న అపోహలను చెరిపివేసేందుకు నిప్పన్‌ ఫౌండేషన్‌ ది టోక్యో టాయిలెట్‌ ప్రాజెక్టును చేపట్టింది.

టోక్యోలోని జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాల్లో 17 పబ్లిక్‌ టాయిలెట్లను పునరుద్ధరించే బాధ్యతను 16 మంది ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లకు అప్పగించింది. వయసు, వైకల్యం, లింగ బేధాలతో నిమిత్తం లేకుండా పబ్లిక్‌ బాత్‌రూంలు అందరికీ అందుబాటులో ఉండేలా వినూత్న డిజైన్‌తో వీటిని చేపట్టాలని సూచించింది. వీటిలో హరునొవగ్వా కమ్యూనిటీ పార్క్‌ వద్ద ప్రిట్కర్‌ ప్రైజ్‌ గెలుపొందిన ఆర్కిటెక్ట్‌ షిగెరు బాన్‌ ఏర్పాటు చేసిన పారదర్శక పబ్లిక్‌ టాయిలెట్ల డిజైన్‌ ఆకట్టుకుంటోందని నిప్పన్‌ ఫౌండేషన్‌ తెలిపింది. బాన్‌ డిజైన్‌ చేసిన ఈ టాయిలెట్లలో ఒక్కో యూనిట్‌లో మూడు క్యూబికల్స్‌ ఉంటాయి. న్యూ స్మార్ట్‌గ్లాస్‌ టెక్నాలజీ వాడటంతో డోర్‌ లాక్‌ చేసి ఉన్న సమయంలో టాయిలెట్‌ గోడలు డార్క్‌గా మారతాయని నిప్పన్‌ ఫౌండేషన్‌ తెలిపింది. రాత్రి సమయాల్లో ఇవి అందమైన లాంతర్ల తరహాలో పార్కుల్లో వెలుగులు విరజిమ్ముతాయని పేర్కొంది. ప్రముఖ ఆర్కిటెక్టులు రూపొందించిన డిజైన్లతో ఆయా పబ్లిక్‌ రెస్ట్‌రూమ్‌లు దశలవారీగా ప్రారంభమవుతాయని వెల్లడించింది. చదవండి : నవ్వొద్దని ప్రభుత్వం ఆంక్షలు, కానీ..

మరిన్ని వార్తలు