ఆకులు మార్చి.. ఏమార్చే.. ఊసరవెల్లి చెట్టు! 

24 Sep, 2023 01:46 IST|Sakshi

పరిసరాలను బట్టి రంగులు మార్చేసే ఊసరవెల్లులు తెలుసు! అక్కడ ఉన్నాయా లేవా అన్నట్టుగా పరిసరాల్లో కలిసిపోయే కీటకాలు, జంతువులూ మనకు తెలుసు! కానీ తాను పాకే చెట్టును బట్టి ఆకుల ఆకృతిని మార్చేసుకునే తీగ చెట్టు తెలుసా? ప్రకృతి వింతల్లోనే వింతైనదిగా శాస్త్రవేత్తలు చెప్తున్న ఆ తీగ చెట్టు ఏమిటి? ఆకుల ఆకృతిని మార్చుకోవడం ఏమిటో తెలుసుకుందామా..   – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

చెట్టు వేరు.. ఆకులు ఒకటే.. 
చిలీలోని దట్టమైన అడవులు.. ఎర్నెస్టో గియనోలి అనే వృక్ష శాస్త్రవేత్త చెట్లు, మొక్కలపై పరిశోధన చేస్తున్నారు. నడు స్తూ వెళ్తున్న ఆయన ఓ చోట పడి ఉన్న ఆకులను చూసి ఆశ్చర్యంతో ఆగిపోయారు. అక్కడున్న చెట్టు ఆకులు ఒక ఆకారంలో ఉంటే.. కిందపడి ఉన్న ఆకులు భిన్నమైన ఆకారాల్లో ఉండటమే దానికి కారణం. ఇదేమిటా అని పరిశోధన చేసిన ఎర్నెస్టో.. తానున్న చెట్టును బట్టి ఆకుల ఆకృతిని మార్చేసే తీగ చెట్టును గుర్తించారు. ఆ తీగ చెట్టుకు ‘బోక్విలా ట్రైఫోలోలిటా’గా పేరు పెట్టారు.

చెట్టులో చెట్టు.. తీగలో తీగ.. 
ఏ చెట్టు, మొక్క అయినా దాని ఆకుల న్నీ ఒకేలా ఉంటాయి. ఆకారం నుంచి  రంగు దాకా పెద్దగా తేడా ఉండదు. కానీ ‘బోక్విలా ట్రైఫోలోలిటా’తీగ చెట్టు మాత్రం.. తాను పాకుతూ పెరిగే ఇతర చెట్లు, మొక్కల ఆకులను పోలినట్టుగా తన ఆకులను మార్చుకుంటుంది. ఒక్క ఆకారమే కాదు, పరిమాణం, రంగు కూడా మార్చుకోగలగడం విచిత్రం. పలు దక్షిణ అమెరికా దేశాల్లోని అడవుల్లో ఈ తీగ చెట్లు పెరుగుతాయని చెప్తున్నారు. 

ఒకే తీగపై.. వేర్వేరు ఆకులతో.. 
‘బోక్విలా ట్రైఫోలోలిటా’ తీగ తన ఆకులను గుండ్రంగా, చతురస్రాకారంగా, సన్నగా, పొడవుగా భిన్నమైన ఆకారాలు, పరిమాణాల్లోకి.. రంగుల్లోకి మార్చుకుంటున్నట్టు గుర్తించారు. అంతేకాదు ఒకే తీగ చెట్టు ఎక్కడైనా రెండు వేర్వేరు రకాల చెట్లపైకి పాకి ఉంటే.. ఏ చెట్టుపై పాకి ఉన్న భాగంలో ఆ చెట్టు తరహాలోకి ఆకులను మార్చేసుకుంటున్నట్టు తేల్చారు. అంటే ఒకే తీగచెట్టుకు వేర్వేరు ఆకారాలు, రంగులు, పరిమాణాల్లో ఆకులు ఉండటం గమనార్హం.

మార్చేసుకోవడం ఎందుకు?
చెట్లు, మొక్కలను తినే జంతువులు, కీటకాల నుంచి రక్షణ కోసమే ‘బోక్విలా ట్రైఫోలోలిటా’ ఆకుల ఆకా రాలను మార్చుకుంటున్న ట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నా రు. జంతువులు, కీటకాలు పెద్దగా ఇష్టపడని, తినని చెట్లు/మొక్కల ఆకుల రూపంలోకి తీగచెట్టు తన ఆకులను మార్చేసుకోవడం దీనికి ఉదాహరణ అని వివరిస్తున్నారు.

ఎలా మార్చేసుకుంటోంది? 
‘బోక్విలా ట్రైఫోలోలిటా’ తీగకు ఇతర చెట్లు/మొక్కలతో భౌతికంగా ఎలాంటి అనుసంధానం లేదని.. అయినా ఆకుల రూపాన్ని ఎలా మార్చుకుంటోందన్నది పెద్ద ప్రశ్నగా మారిందని శాస్త్రవేత్తలు ఎర్నెస్ట్, కరాస్కో చెప్తున్నారు. అయితే చెట్లు/మొక్కల నుంచి వెలువడే కొన్ని రసాయన సంకేతాల సాయంతో ‘బోక్విలా ట్రైఫోలోలిటా’తన ఆకుల ఆకారాన్ని మార్చుకుంటూ ఉండొచ్చని ప్రతిపాదించారు. అలాకాకుండా కీటకాలు, సూక్ష్మజీవుల ద్వారా చెట్ల జన్యువులు తీగ చెట్టుకు చేరడం.. అనుకరణకు మార్గం వేస్తుండవచ్చని మరో ప్రతిపాదన కూడా చేశారు.

తీగ చెట్టుకు కళ్లున్నాయా? 
శాస్త్రవేత్తలు అలంకరణ కోసం వాడే ఓ ప్లాస్టిక్‌ చెట్టును తీసుకుని.. దానిపైకి ‘బోక్విలా ట్రైఫోలోలిటా’ తీగ  పెరిగేలా చేశారు. ఆ ప్లాస్టిక్‌ ఆకుల రూపంలోకి కూడా ఈ తీగ చెట్టు ఆకులను మార్చుకుంది. దీనితో జన్యువుల మార్పిడి, రసాయన సంకేతాల వంటి ప్రతిపాదనలు తేలిపోయాయి. ఈ క్రమంలో ‘బోక్విలా ట్రైఫోలోలిటా’లో కాంతిని గ్రహించే కణాలు ఉన్నాయని.. వాటి సాయంతో ఇతర చెట్లు/ మొక్కల ఆకులను గమనించి (చూసి) మార్చుకుంటోందని కొత్త ప్రతిపాదన వచ్చింది. అయితే చెట్లు చూడటమనే ప్రతిపాదనే అసంబద్ధమని శాస్త్రవేత్త ఎర్నెస్ట్‌ స్పష్టం చేస్తున్నారు.

మరి ఆకులు ఎలా మార్చుకుంటోంది?.. ఇది ఇప్పటికీ మిస్టరీయే..

మరిన్ని వార్తలు