Invisibility Shield Co.: మీరు గానీ.. ఒక్కసారి గానీ.. ఈ షీల్డ్‌ వెనక్కి వెళ్లారంటే!

19 Mar, 2022 09:12 IST|Sakshi

హ్యారీ పాటర్‌ సినిమాలో చూసే ఉంటారు. ఒక వింత వస్త్రాన్ని చుట్టేసుకొని హ్యారీ టక్కున మాయమైపోతుంటాడు. అతను అక్కడే ఉన్నా చూసే వాళ్లకు మాత్రం లేడనిపించేలా ఆ వస్త్రం కనికట్టు చేస్తుంది. వెనకున్న వస్తువులు కనిపిస్తాయి కాని అతను మాత్రం కనిపించడు. మళ్లీ దాన్ని తీసేయగానే హ్యారీ బయటకు కనిపిస్తుంటాడు. ఇలా సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో కనిపించే ఈ వెరైటీ వస్త్రాన్ని ఇప్పుడు నిజంగానే షీట్‌ రూపంలో తయారు చేశారు. లండన్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ ‘ఇన్‌విజిబిలిటీ షీల్డ్‌ కో’.. ఈ మ్యాజిక్‌ షీట్‌ను తాజాగా ప్రపంచానికి పరిచయం చేసింది.  

ఎంతలా కష్టపడ్డారో! 
ఇన్‌విజిబిలిటీ షీల్డ్‌ను అనుకున్నట్టు తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డామని తయారీ బృందం చెప్పింది. ఎన్నో వస్తువులు, పదార్థాలను పరీక్షించామని, ఎన్నో వైఫల్యాలు ఎదురయ్యాయని తెలిపింది. విభిన్న కోణాలు, ఆకృతులు, దూరాల్లో లెన్స్‌లను పరీక్షించామని.. చివరగా కుంభాకార కటకాలను పాలిమర్‌ షీట్‌లో ఓ శ్రేణిలో అమర్చి అనుకున్న ఫలితాన్ని రాబట్టామని వివరించింది. గడ్డి ప్రాంతాలు, తీర ప్రాంతాలు లాంటి బ్యాక్‌గ్రౌండ్‌ ఒకేలా ఉన్న ప్రదేశాల్లో ఈ షీల్డ్‌లు అద్భుతంగా పని చేస్తాయంది. ఎక్కువ ఉష్ణోగ్రతను, అల్ట్రావయోలెట్‌ కాంతిని తట్టుకోగలవని తెలిపింది. ఇంతకీ ఈ షీల్డ్‌ల ధరెంతో తెలుసా? 37్ఠ25 ఇంచుల షీల్డ్‌కు కేవలం రూ.30 వేలు. ఇప్పటికే 25 షీల్డ్‌లను తయారు చేశారు. మరిన్ని తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు.  

షీల్డ్‌ ఎలా పని చేస్తుందంటే..? 
ఇన్‌విజిబిలిటీ షీల్డ్‌ వెనుక దాక్కునే వ్యక్తులు, వస్తువులు కనిపించకుండా ఉండేందుకు నిలువు పద్ధతిలో ప్రత్యేక లెన్స్‌ శ్రేణిని (ఒకదాని పక్కన మరొకటి వరుసగా పేర్చడం) వాడారు. షీల్డ్‌ ముందు నుంచి చూసే వ్యక్తికి షీల్డ్‌ వెనకున్న వ్యక్తి కనిపించకుండా కాంతిని పరావర్తనం చెందించే సూత్రాన్ని ఉపయోగించారు. అంటే షీల్డ్‌ వెనకున్న వ్యక్తి నుంచి పరావర్తనం చెందే కాంతి షీల్డ్‌ ముందున్న వ్యక్తి వరకు చేరకుండా పక్కలకు ప్రసరించేలా లెన్స్‌లను వాడారు. షీల్డ్‌ వెనకున్న బ్యాక్‌గ్రౌండ్‌ మాత్రం బాగా కనబడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంగా షీల్డ్‌ వెనకున్న వ్యక్తి కనిపించడు కానీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌ మాత్రం కనిపిస్తుంది. అంటే షీల్డ్‌ వెనకున్న వ్యక్తి మాయమైనట్టే!  
చదవండి: 24 వేల ఏళ్లుగా గడ్డకట్టే మంచులోనే పడిఉంది... కానీ ఆ జీవి బతికే ఉంది!


 –సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు