డ్రోన్ల ద్వారా కరోనా టెస్ట్‌ కిట్ల సరఫరా

18 Oct, 2020 06:05 IST|Sakshi

యూకేలో స్టార్టప్‌ ప్రాజెక్టు

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో ఇద్దరు ట్రైనీ డాక్టర్లు ప్రారంభించిన స్టార్టప్‌ ప్రాజెక్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. హమాద్‌ జిలానీ, క్రిస్టోఫర్‌ లా అనే ఈ వైద్యులు మెడికల్‌ డ్రోన్‌ డెలివరీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి సేకరించిన కరోనా వైరస్‌ నమూనాలు, టెస్టింగ్‌ కిట్లు, పీపీఈ కిట్లను ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి.. ఆసుపత్రుల నుంచి ఇళ్లకు డ్రోన్ల ద్వారా చేరవేయడమే దీని ఉద్దేశ్యం. ఈ డ్రోన్లకు చిన్న రెక్కలు ఉంటాయి. ఇవి దాదాపు 2 కిలోల బరువును 96 కిలోమీటర్లదాకా మోసుకెళ్లగలవు. మెడికల్‌ డ్రోన్‌ డెలివరీ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి దాదాపు రూ.12.48 కోట్ల ఆర్థిక సాయం అందజేయడానికి యూకే అంతరిక్ష పరిశోధనా సంస్థ, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ముందుకొచ్చాయి. వైరస్‌ శాంపిల్స్, టెస్టింగ్‌ కిట్లను డ్రోన్లతో చేరవేస్తే కరోనా వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చని జిలానీ, క్రిస్టోఫర్‌ లా చెబుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు