Russia Ukraine War: ఉ‍క్రెయిన్‌ సాయాన్ని అడ్డుకున్న అమెరికా!! పోల్యాండ్‌ ప్రతిపాదనకు నో

9 Mar, 2022 13:23 IST|Sakshi

ఉక్రెయిన్‌కు ప్రత్యక్ష సాయం చేయని అమెరికా.. పరోక్షంగా బయటి నుంచి అందే సాయాన్ని అడ్డుకోవడం విశేషం.  అమెరికా ఎయిర్‌ బేస్‌ ద్వారా ఉక్రెయిన్‌కు MiG-29 ఫైటర్‌ జెట్లను పంపాలనుకున్న పోల్యాండ్‌ ప్రతిపాదనను అగ్రరాజ్యం తోసిపుచ్చింది. అసలు ఆ ప్రతిపాదనను అమెరికా తప్పు పట్టింది.

ఉక్రెయిన్‌కు సాయం చేయాలన్న పోల్యాండ్‌ ప్రతిపాదన.. మొత్తం నాటో కూటమికి ఆందోళన కలిగించే విషయమైని పేర్కొంది. జర్మనీలోని రామ్‌స్టెయిన్‌లో ఉన్న యూఎస్‌ ఎయిర్‌బేస్‌కు చెందిన సోవియట్ కాలం నాటి విమానాలను ఉక్రెయిన్‌కు తరలించే ప్రతిపాదనను అమెరికా అధికారులు వ్యతిరేకించారు. ఒప్పందం ప్రకారం MiG-29 ఫైటర్‌ జెట్లను ఉక్రెయిన్‌ పంపడం సాధ్యపడదని తెలిపారు. అయితే వాటి స్థానంలో F-16 ఫైటర్లను తరలించవచ్చని చెప్పారు. కానీ, ఇది పోల్యాండ్‌కు ఏమాత్రం ఇష్టం లేదు.

ఈ విషయంపై పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై రష్యా వైమానికదాడులు చేస్తున్న క్రమంలో యూఎస్‌-నాటో ఎయిర్‌ బేస్‌ నుంచి MiG-29 ఫైటర్‌ జెట్లను పోల్యాండ్‌ పంపాలన్న ప్రతిపాదన సరైంది కాదని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రతిపాదన మొత్తం నాటో కూటమికి ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.

తాము పోల్యాండ్‌, ఇతర NATO మిత్రదేశాలతో ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. లాజిస్టికల్ సవాళ్లతో కూడిన పోల్యాండ్‌ ప్రతిపాదన సమర్థనీయం కాదని తెలిపారు. మరోవైపు రష్యా బలగాలు.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. రష్యా మిలటరీ బలగాలు విధ్వంసం 14వ రోజు కూడా కొనసాగుతోంది. ఇక, ఇవాళైన చర్చల్లో పురోగతి ఉంటుందేమో అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అంతా.

చదవండి: భారత్‌కు రుణపడి ఉంటా: పాక్‌ విద్యార్థిని భావోద్వేగం

మరిన్ని వార్తలు