భారత్‌కు ఎంతో సహాయం చేస్తున్నాం.. మరింత చేస్తాం

6 May, 2021 01:19 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

వాషింగ్టన్‌: కరోనా సెకండ్‌ వేవ్‌పై జరుగుతున్న యుద్ధంలో భారత్‌కు బాసటగా నిలుస్తున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ చెప్పారు. భారత్‌కు గణనీయమైన సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రాణాధార ఔషధాలు, కీలకమైన వైద్య పరికరాలు పంపిస్తున్నామని అన్నారు. ఇప్పటిదాకా అమెరికా నుంచి భారత్‌కు ఆరు విమానాల్లో ఔషధాలు, పరికరాలు వచ్చాయి. ఇందుకు యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూఎస్‌ఏఐడీ) నిధులు సమకూర్చింది. ఔషధాలతోపాటు ఆక్సిజన్‌ సిలిండర్లు, ఎన్‌95 మాస్కులు భారత్‌కు చేరుకున్నాయి. తాను ఇటీవలే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడానని చెప్పారు.

కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకులు అందజేయాలని మోదీ కోరారని, ఈ మేరకు వాటిని పంపించామని వివరించారు. బైడెన్‌ తాజాగా వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. భారత్‌కు ఎంతో సహాయం చేస్తున్నామని ఉద్ఘాటించారు. జూలై 4 నాటికి అమెరికా వద్ద ఉన్న అస్ట్రాజెనెకా వ్యాక్సిన్లలో 10 శాతం వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిస్తామన్నారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో ప్రస్తుతం భారత్‌కు తోడుగా ఉండాల్సిన అవసరం చాలా ఉందని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌ సాకీ చెప్పారు. ఔషధాలు, పరికరాలు, ప్రాణ వాయువు సిలిండర్లతో కూడిన మరికొన్ని విమానాలను భారత్‌కు పంపుతామన్నారు.  

మరిన్ని వార్తలు