హెచ్‌–1బీ వీసాల జారీకి రెండోసారి లాటరీ

31 Jul, 2021 03:54 IST|Sakshi

వాషింగ్టన్‌: హెచ్‌–1బీ వర్క్‌ వీసా కోసం ఎదురు చూస్తున్న భారత ఐటీ నిపుణులకు శుభవార్త. ఈ వీసాల జారీకి రెండోసారి లాటరీ నిర్వహించాలని యూఎస్‌ సిటిజెన్‌షిప్, ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) నిర్ణయించింది.  మొదటి దశలో వీసాలు పొందలేని వారికి ఈ విధంగా మరో అవకాశం లభించనట్లే. హెచ్‌–1బీ వీసాల జారీకి ఈ ఏడాది ప్రారంభంలో కంప్యూటరైజ్డ్‌ డ్రా నిర్వహించారు. అయితే, అర్హులైన వారు చాలామంది వీసాలు పొందలేకపోయారు. అందుకే రెండోసారి లాటరీ నిర్వహించాలని నిర్ణయించినట్లు యూఎస్‌సీఐఎస్‌ గురువారం ప్రకటించింది. ఏటా కేవలం 65వేల హెచ్‌–1బీ వీసాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్‌ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. హెచ్‌–1బీ అనేది నాన్‌–ఇమ్మిగ్రెంట్‌ వీసా. దీనితో అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను స్వదేశంలో ఉద్యోగాల్లో నియమించుకోవచ్చు.  రెండోసారి లాటరీ విషయంలో పిటిషన్‌ ఫైలింగ్‌ ఆగస్టు 2 నుంచి నవంబర్‌ 3 వరకు ఉంటుందని యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. 

మరిన్ని వార్తలు