చాంప్‌ మృతితో విషాదంలో బైడెన్‌ దంపతులు.. 13 ఏళ్ల జ్ఞాపకాలు

20 Jun, 2021 16:33 IST|Sakshi

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ కుటుంబానికి ఎంతో ఇష్టమైన జ‌ర్మ‌న్ షెఫ‌ర్డ్ శున‌కం చాంప్ (13) మరణించింది. వ‌యోభారం కార‌ణంగానే డాగ్‌ చనిపోయినట్లు బైడెన్ కుటుంబం వెల్ల‌డించింది. చాంప్‌ మృతి చెందిన విషయాన్ని అమెరికా తొలి మహిళ జిల్ బైడెన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘మా ప్రియమైన చాంప్‌, నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మేము నిన్ను ఎల్లప్పుడూ కోల్పోతాము’ అని సంతాపాన్ని తెలియజేశారు.

2008లో అమెరికా ఉపాధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో బైడెన్‌ ఓ జంతువుల వ్యాపారి నుంచి చాంప్‌ను చిన్న కూన‌గా కొనుగోలు చేశారు. ఇక అప్ప‌టి నుంచి చాంప్‌ బైడెన్ కుటుంబంలో ఓ భాగమైంది. గత 13 ఏళ్లుగా ఆ శునకంతో ఉన్న జ్ఞాపకాలను బైడెన్‌ దంపతులు గుర్తు చేసుకున్నారు. డెలావ‌ర్‌ ఉన్న బైడెన్ స్వ‌గృహంతోపాటు శ్వేత సౌధంలోనూ చాంప్‌కు ప్ర‌త్యేక స్థానం ఉండేది. కాగా, చాంప్‌ మృతితో బైడెన్ ఇంట్లో ఉండే మ‌రో శున‌కం మేజ‌ర్ ఒంట‌రిది అయ్యింది. బైడెన్ ప్ర‌తిరోజు వాకింగ్‌కు వెళ్లే స‌మ‌యంలో ఆ రెండు శున‌కాల‌ను వెంట తీసుకెళ్లేవాడ‌ట‌.

చదవండి: బైడెన్‌ దంపతుల ఆదాయమెంతో తెలుసా?

మరిన్ని వార్తలు