హెచ్‌1–బి వీసాలకు మళ్లీ ‘లాటరీ’యే

23 Dec, 2021 05:17 IST|Sakshi

కేటాయింపు ప్రకియలో మార్పులను ఉపసంహరించుకున్న అమెరికా

వాషింగ్టన్‌: వృత్తి నిపుణులకు మంజూరు చేసే హెచ్‌1–బి వీసాల కేటాయింపును పాత పద్దతిలో ‘లాటరీ’ విధానంలోనే కొనసాగించాలని అమెరికా నిర్ణయించింది. అమెరికా ప్రతి ఏటా 85 వేల హెచ్‌1– బి వీసాలను (నిర్ణీత కోటా 65 వేలు,, అమెరికా వర్శిటీల్లో పీజీ.. ఆపై కోర్సులు చేసిన వారికి అదనంగా 20 వేల హెచ్‌1–బి వీసాలు) జారీ చేస్తోంది. టెక్‌ కంపెనీలు, ఇతర సంస్థలు ఈ కోటాకు మించి హెచ్‌1–బి వీసా దరఖాస్తులు సమర్పిస్తే... లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి వీసాలను కేటాయించేవారు.

2022 ఆర్థిక సంవత్సరానికి గాను అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు అందిన విషయం గమనార్హం. అత్యంత ప్రతిభావంతులనైన వృత్తి నిపుణులనే అమెరికాలోకి అనుమతించాలనే ఉద్దేశంతో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం లాటరీ పద్దతికి స్వస్తి పలికి ఈ ఏడాది జనవరి 8న కొత్త విధానాన్ని తెచ్చింది. వేతనాల ఆధారంగా హెచ్‌1–బి వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది.

అత్యధిక వేతనాలు పొందుతున్న వారికే ప్రాధాన్యత క్రమంలో మొదట వీసాలు దక్కుతాయి. ఈ ఏడాది మార్చి 9 నుంచి దీన్ని అమలు చేయాలని భావించినా... అది ఆలస్యమైంది. మరోవైపు సెప్టెంబరులో వేతనాల ఆధారిత వీసా కేటాయింపు విధానాన్ని కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టు కొట్టివేసింది. దాంతో లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్‌ సర్కారు నిర్ణయించింది. అత్యధిక వేతనాల ఆధారంగా హెచ్‌1–బి వీసాలను జారీచేస్తే ఇతర దేశస్తుల కంటే భారత టెకీలకు అధిక ప్రయోజనం చేకూరేది.

మరిన్ని వార్తలు